అమ‌రావ‌తిలోని ప్ర‌జావేదిక కూల్చివేత విష‌యంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. రాత్రి 11.15 గంటల సమయంలో 'ప్రజా వేదిక' ప్రధాన భవనం కూల్చివేత పనులు మొదలవ‌గా ఇవాళ ఉదయానికి దాదాపు 70 శాతం కూల్చివేత పూర్తయింది. ఇవాళ సాయింత్రానికి కూల్చివేత పూర్తవుతుందని తెలుస్తోంది. కాగా, ఈ ఎపిసోడ్‌లోకి ఇటు హైకోర్టు...అటు బీజేపీ ఎంట్రీ ఇచ్చారు. 


మంగ‌ళ‌వారం సాయంత్రం కరకట్టను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజావేదికలోని సమాన్లను అధికారులు బయటకు తరలించారు. రాత్రి 11 గంట‌ల‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కూలీలు గోడలు పగలగొట్టడంతో కూల్చివేతను ప్రారంభించారు.  ప్రజావేదికను కూల్చి వేస్తున్నారని తెలిసి రాజధానికి చెందిన కొందరు రైతులు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని పంపించేశారు.  ఇదిలాఉండ‌గా, ప్ర‌జా వేదిక విష‌యంలో హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. ప్ర‌జావేదిక కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు మంగ‌ళ‌వారం రాత్రి పొద్దుపోయాక హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అర్ధ‌రాత్రి 2.30 దాటిన తర్వాత కూడా హైకోర్టు జడ్జిల ఎదుట విచారణ కొనసాగినా.. కూల్చివేత నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజావేదిక కూల్చివేతపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ఒక్క ప్రజావేదిక మాత్రమే కూల్చాలనుకుంటే సరికాదని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి వినియోగించడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదనేదే తన అభిమతం అని కన్నా చెప్పారు.

కాగా, గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదికను నిర్మించినందున తక్షణమే కూల్చివేస్తామని కలెక్టర్లు సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మంగళవారం సదస్సు ముగిసిన వెంటనే సీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగారు. కాగా, ఈ భవనం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ప్రక్కనే ఉండడం.. ఆయన విదేశీ టూర్‌ను ముగించుకుని గతరాత్రే ఇంటికి రావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో ఆ భవనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: