తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చిర‌కాల వాంచ నేడు నెర‌వేర‌నుంది. ముఖ్య‌మంత్రి పీఠం చేప‌ట్టింది మొద‌లు నేటి వ‌ర‌కు...ఆయ‌న త‌పిస్తున్న అంశం గురువారం సాకారం చేసుకోనున్నారు. కొత్త సెక్ర‌టేరియ‌ట్ క‌ల‌కు నేడు కేసీఆర్ శ్రీకారం చుట్ట‌నున్నారు. రూ.400 కోట్ల  వ్యయంతో నిర్మించే కొత్త సెక్రటేరియట్ కు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. కొత్త స‌చివాల‌యంతో పాటుగా అసెంబ్లీకి సైతం ఆయ‌న భూమిపూజ చేస్తారు.

ఉదయం 10గంటల 40 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ కు చేరుకుంటారు. 11 గంటలకు డి-బ్లాక్ ప్రాంతంలో కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణానికి.. ఈశాన్య మూలన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొంటారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత.. నేరుగా ఎర్రమంజిల్ కు చేరుకుంటారు ముఖ్యమంత్రి. 12 గంటలకు కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో భూమిపూజ చేయనున్నారు ముఖ్యమంత్రి. 100 కోట్లతో ప్రసుత్తమున్న అసెంబ్లీ మోడల్లోనే కొత్త అసెంబ్లీని ప్రభుత్వం నిర్మించనుంది. భూమిపూజ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పక్కావాస్తుతోపాటు అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మాణం జరుగనున్నది. ఇందుకోసం సమావేశహాళ్లు, కలెక్టర్ల సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ నిర్మించనున్నారు. అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటుకూడా చేయనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షాలను ట్రాన్స్‌రిలోకేషన్ పద్ధతిలో సంరక్షించాలని అధికారులు యోచిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా, కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది.  పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది. సెక్రటేరియట్ నిర్మాణంపై హైకోర్టులో కేసు ఉండడంతో తక్కువ మందితో మాత్రమే శంకుస్థాపన చేస్తున్నట్లు సెక్రటేరియట్ అధికారులు తెలిపారు.  పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భూమిపూజ కోసమే కొత్త సెక్రటేరియట్‌కు కేసీఆర్ వస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: