కర్ర ఇరగకూడదు.. పాము చావకూడదు.. అన్న మాదిరి తయారయ్యింది, కన్నిడుగుల రాజకీయం. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ జేడీఎస్ పార్టీల అధినేతలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. అంతేస్థాయిలో అసంతృప్త ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రతిపక్ష బీజేపీ నేతలు చూస్తున్నారు. రాజకీయ ఎత్తుకుపైఎత్తుల మధ్య ఎవరి పైచేయి సాధిస్తారనే ఆసక్తికర ఫలితం కోసం అంతా వేచి చూస్తున్నారు.

 

కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మనుగడ కష్టసాధ్యంగా కనిపిస్తోంది. ఎన్నో రోజులు నిలవదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్కు చెందిన ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి- ఆనందసింగ్ ఇటీవల పార్టీకి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరికొందరు కూడా అదే బాట పట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ రాజీనామాకు ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ పరోక్షంగా బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం.

 

అయితే బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు తెలిస్తేనే తాము రాజీనామా చేస్తామని కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలిసింది. ఈ లెక్కన సుమారు 14 మంది ఎమ్మెల్యేలు బీఎస్ యడ్డూరప్పకు ఫోన్లో మాట్లాడారనే ప్రచారం సాగుతోంది. కానీ యడ్డూరప్ప మాత్రం ఒప్పుకోవడం లేదు. తనకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ట్రాప్ చేశారని సమాధానం ఇచ్చారు. అయితే తమ షరతులకు ఒప్పుకుంటే సుమారు 14 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. జూన్ 2వ తేదీ నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సమయానికి సంకీర్ణ ప్రభుత్వాన్ని పతనం చేయాలని బీజేపీ నాయకులు పక్కా స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. 

 

ఇందులో భాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్ష నేత బీఎస్ యడ్డూరప్ప నేతృత్వంలో ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాల గందరగోళం మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలు.. అమెరికాలో సీఎం కుమారస్వామికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అవసరమైతే త్వరగా బెంగళూరుకు రావాల్సిందిగా ఫోన్ ద్వారా తెలియజేశారు.  ప్రభుత్వ ఉనికిని కాపాడే విషయంపై సమాలోచనలు చేయాలని సిద్ధరామయ్య కోరారు. ఈనెల 7వ తేదీన సీఎం కుమారస్వామి కర్ణాటక తిరిగి వస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా తన అమెరిక పర్యటనను ముగించుకుని రావాలని కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: