ఓ రాజకీయ పార్టీని అభిమానించడంలో తప్పులేదు.. ఓ నాయకుడిని ఆరాధించడంలో తప్పు లేదు.. కానీ అది దురాభిమానం కాకూడదు. ఎదుటి పక్షం వారిపై బురద జల్లిలా, అసభ్యంగా, అశ్లీలంగా ఉండకూడదు. కానీ.. దురదృష్టం కొద్దీ సోషల్ మీడియాలో ఇలాంటి దరిద్రపు ట్రెండ్ కొనసాగుతోంది.


అందుకే.. ఇలాంటి పోస్టులపై ఎదుటి పక్షం వారు స్పందిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా అమరావతి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.


అమరావతిలోని గోపాల్‌నగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త పెద్దిబోయిన వెంకట శివరావు.. ఫేస్‌బుక్‌లో మార్చి 12వ తేదీన రవిచౌదరి అనే వ్యక్తి చేసిన పోస్టును ఈ నెల ఒకటో తేదీన తన స్నేహితులకు షేర్‌ చేశాడు. వెంకటశివరావును పోలీసులు అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి కోర్టుకు తరలించారు.


మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ప్రభాకరరెడ్డి అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో అసభ్య వ్యాఖ్యలు, దృశ్యాలతో కూడిన పోస్ట్‌ను పెట్టారని పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్‌ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే రీతిలో ఈ పోస్టింగ్‌ ఉందని పేర్కొన్నారు. ప్రభాకరరెడ్డి అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉండే ప్రవాస భారతీయుడని, వైకాపా సానుభూతిపరుడని వర్ల చెబుతుతన్నారు. ప్రభాకరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పోలీసులకు ఆధారాలు అందజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: