అక్రమంగా నిర్మించిన ఇంట్లో తెదేపా అధినేత చంద్రబాబు ఉంటున్నారని, నైతిక బాధ్యత వహించి, ఆయన వెంటనే అక్కడి నుంచి త్వరగా తట్ట-బుట్ట సర్దుకొని ఖాళీ చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్‌ చేశారు. ఇప్పటికే దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. విజయవాడలోని వైకాపా కార్యాలయంలో రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

 

ఇంటి యజమాని లింగమనేని రమేశ్‌ను చంద్రబాబు భయపెట్టి రోజుకో విధంగా మాట్లాడిస్తున్నారని ఆళ్ల ఆరోపించారు. చంద్రబాబు ఉంటున్న ఇంటితో తనకు సంబంధం లేదని, ప్రభుత్వానికి ఇచ్చేశామని గతంలో చెప్పిన లింగమనేని రమేశ్‌.. ఇప్పుడు మాట మార్చి ఆ ఇల్లు తనదే అంటున్నారన్నారు.

 

తాను ఉంటున్న ఇంటిని సీఆర్‌డీఏ ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రభుత్వం సేకరించిందని చంద్రబాబు కూడా గతంలో చెప్పిన విషయాలను ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు. దీనిపై లింగమనేని రమేశ్‌, చంద్రబాబు మీడియాలో మాట్లాడిన వీడియో క్లిప్పింగులను ఆళ్ల ప్రదర్శించారు.

 

చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసం ప్రభుత్వానిదా?తనదా? అనే విషయాన్ని లింగమనేని రమేశ్ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కరకట్టపై ఉన్న ఏ అక్రమ నిర్మాణాన్నీ వదిలేది లేదన్నారు. వైఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని చెప్పేవారు వాటికి ఆధారాలు చూపించాలన్నారు. కరకట్టపై నిర్మాణాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉంటే వారు కూడా శిక్షార్హులేనని ఆళ్ల అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: