కర్ణాటకలో రాజకీయ పరిస్థితి పతాక స్థాయికి చేరుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా రాజీనామా చేస్తుండటంతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం రసకందాయంలో పడింది. తాజాగా రాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ కూడా రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నానని, భాజపాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

 

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్‌కు దిగింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్‌ మంత్రులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీంతో కర్ణాటక రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 13 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

వారిని బుజ్జగించేందుకు జేడీఎస్‌, కాంగ్రెస్‌ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అసమ్మతి నేతలకు కేబినెట్‌లో స్థానం కల్పించాలని చూస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ మంత్రులు త్యాగానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే ఈ మంత్రులంతా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడికి తమ రాజీనామాలను సమర్పించారు. వీరి స్థానంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి భావిస్తోంది.

 

తాజా చర్యలతో సంకీర్ణ కూటమి సంక్షోభం నుంచి బయటపడుతుందని ఆ పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అసమ్మతి నేతలు తిరిగి కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ మీడియాతో అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: