ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం అమ్మకాలను షాపుల నుంచి తొలగించి పైవ్ స్టార్ హోటళ్ళలో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు గతంలో బెల్టు షాపులు ఎక్కడ కనిపించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. ఇప్పుడు మరో సరికొత్త నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అసలే ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయం తీసుకువచ్చే మద్యం షాపులపైనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కసరత్తు ప్రారంభించింది.

మధ్యం అమ్మే సమయాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అక్టోబరు నుంచి అమలు చేయనున్న నూతన పాలసీలో అమ్మకాలను సాయంత్రం 6గంటల వరకే పరిమితం చేయాలని ఆలోచన చేస్తోంది. సాయంత్రం అమ్మకాలను నాలుగు గంటలు తగ్గిస్తే అమ్మకాలు పెద్దఎత్తున తగ్గిపోతాయని ప్రభుత్వం భావన. సాధారణంగా మద్యం అమ్మకాలు సాయంత్రం నుంచి రాత్రి వరకే ఎక్కువగా ఉంటాయి. పనులు ముగించుకొని వచ్చిన మందుప్రియులు అధికంగా రాత్రే మద్యం తాగుతారు. అందువల్లే రాత్రి అయితే మద్యం షాపులు కిక్కిరిసి పోతుంటాయి. ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచనా. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

నూతన పాలసీ అక్టోబరు నుంచి అమల్లోకి రానున్నందున ప్రభుత్వం పలు రకాల కొత్త ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. అందులో సమయం కుదింపు అంశం ఒకటి. కొత్త పాలసీలో ప్రభుత్వమే షాపులు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ షాపుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించుకోనుంది. సమయాన్ని తగ్గిస్తే సిబ్బంది పనివిధానం కూడా సులభతరం అవుతుందనేది మరో ఆలోచన. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అంటే రెండు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. కానీ అది ప్రభుత్వానికి అదనపు భారం అవుతుంది. అందువల్ల సాయంత్రం 6గంటల వరకు అమ్మకాలను కుదిస్తే ఒకే షిఫ్టుతో సిబ్బందితో పనిచేయించుకోవచ్చు.

ప్రస్తుతం వందలరకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్సైజ్‌ శాఖతో ఒప్పందం చేసుకున్న సంస్థలన్నీ వారి బ్రాండ్లు రాష్ట్రంలో అమ్ముకోవచ్చు. ప్రస్తుతం 340 రకాల బ్రాండ్లు ఏపీలోకి వస్తున్నాయి. అందులో విస్కీ, బ్రాందీ, రమ్ము, వోడ్కా, బ్రీజర్‌, జిన్ను లాంటి లిక్కర్‌ బ్రాండ్లే 270 వరకూ ఉన్నాయి. ఇక బీర్ల విషయానికి వస్తే మద్యం షాపుల్లో ఒక ఉన్నది మరోక షాపులో ఉండదు. దాదాపుగా ఒక పట్టణంలో 50 నుంచి 60 రకాల మద్యం అమ్ముడు అవుతుంది. అయితే వీటిని కూడా తగ్గించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిమితమైన బ్రాండ్లను మాత్రమే అమ్మేలా చూసి, మిగతా వాటన్నిటికీ స్వస్తి పలకాలని చూస్తోంది. ఇది కూడా అమ్మకాలు తగ్గించేందుకు దోహదం చేస్తుందనేది ప్రభుత్వం ఆలోచన. అయితే ఏ బ్రాండ్లు తీసేయాలి, ఏవీ అందుబాటులో ఉంచాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: