వలసలను నియంత్రించేందుకే చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ ఎదురుచూడని విధంగా టిడిపికి ఘోరపరాజయం ఎదురైన విషయం తెలిసిందే. దాంటో టిడిపి భవిష్యత్ మీద, చంద్రబాబు నాయకత్వంపై అనుమానాలతో చాలామంది టిడిపి నేతలు పార్టీని వదిలేసేందుకు రెడీ అవుతున్నారు.

 

అసలే ఓటమిబాధ నుండి ఇంకా బయటపడని చంద్రబాబు మీద నేతల రాజీనామాలు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది. ఇప్పటికే ఆరుగురు రాజ్యసభ ఎంపిల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించారు. మాజీ ఎంఎల్ఏలు కొందరు బిజెపిలోకి వెళిపోయారు. మరికొందరు వైసిపిలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 

ఈ నేపధ్యంలోనే నేతల వలసలను ఆపకపోతే రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్ధులు కూడా దొరకరని చంద్రబాబుకు అర్ధమైపోయింది. ఒకవైపేమో పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మంచి దూకుడుమీదున్నారు. ఇంకోవైపేమో చంద్రబాబును పూర్తిగా దెబ్బకొట్టాలని బిజెపి ప్లాన్లు వేస్తోంది. ఇపుడు కూడా తాను పట్టించుకోకపోతే నేతలెవరూ మిగలరన్న విషయం చంద్రబాబుకు అర్ధమైపోయింది.

 

ఇదే సమయంలో అక్కడక్కడ వైసిపి-టిడిపి నేతల మధ్య స్ధానిక గొడవల్లో నలుగురు కార్యకర్తలు మరణించింది వాస్తవం. ఆ ముసుగులో చంద్రబాబు వెంటనే జిల్లాల టూర్లు పెట్టేసుకున్నారు. ఇప్పటి వరకూ చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో తిరిగిన చంద్రబాబు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. తర్వాత గుంటూరులోని మంగళగిరిలో పర్యటిస్తారట. తన పర్యటనల్లో నేతలు, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచటమే లక్ష్యంగా టూర్లు చేస్తున్నారు. మరి ఎంతమంది నేతలు చంద్రబాబు మాటవిని టిడిపిలోనే ఉంటారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: