తాడేపల్లి లోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ధర్నా చౌక్ ను తలపిస్తోంది . తమ సమస్యలను చెప్పుకుంటే ఆయన వాటిని తక్షణమే  పరిష్కరిస్తారని భావిస్తోన్న వివిధ వర్గాల ప్రజలు , ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్య లో తరలి వచ్చి ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగడం గత కొన్ని రోజులుగా  పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రుల ఇంటివద్దకు పెద్దగా సందర్శకులను రాణించే దాఖలాలు అరుదనే చెప్పాలి . ఎవరికైనా ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఉంటే మాత్రమే వారిని  పోలీసులు అనుమతి ఇస్తుంటారు .. లేనిపక్షం లో అల్లంత  దూరంలోనే వారిని వెనక్కి నెట్టివేస్తుంటారు . కానీ ఏపీ ముఖ్యమంత్రి ఇంటివద్దకు మాత్రం బాధితులు ఇబ్బడి, ముబ్బడిగా తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామనే చెప్పాలి .


 సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యలను తీసుకు వచ్చేందుకు ఆయన  నివాసం వద్దకు మంగళవారం కూడా  వివిధ వర్గాల ప్రజలు,  పలు విభాగాల ఉద్యోగులు ,  పెద్ద ఎత్తున తరలివచ్చి  ప్లకార్డులను ప్రదర్శించి తమ  సమస్యలు తెలియజేసేందుకు  సీఎం ను కలిసే  అవకాశం ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు .  మాజీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాగూర్ కు వ్యతిరేకంగా సీఎం నివాసం వద్ద కొందరు ఉద్యోగుల నిరసనకు దిగారు . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పుకోసం తమపై అక్రమ కేసులు బనాయించారంటూ వారు  ఫ్లెక్సీలు  ప్రదర్శిస్తూ , టీడీపీ నేతలకు సహకరించలేదన్న కారణంగా  ఠాగూర్ తమపై  పెట్టిన తప్పుడు కేసులపై రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు . టీడీపీ తొత్తుగా వ్యవహరించి వందలాది కుటుంబాలను ఇబ్బందిపెట్టిన ఠాగూర్ ని సస్పెండ్ చేయాలంటూ  బాధితులు  డిమాండ్ చేశారు . తొమ్మిదేళ్లుగా ఏసీబీలో బదిలీలు లేవని, వెంటనే బదిలీలు చేయాలని  బాధితులు కోరారు .


 గ్రామ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగులుగా తమని  నియమించాలని కోరుతూ  గోపాలమిత్ర ల  ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు . అలాగే శ్రీశైలం  ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ , సీఎం ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని  నిర్వాసితులు కోరారు . గ్రామ సచివాలయాల్లో నియమించే వీఆర్వోలుగా తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ తో విఆర్ ఎ ల ఆందోళన చేపట్టారు . తమను విధుల్లో కొనసాగించాలని పలు పాలిటెక్నిక్ కళాశాలల్లోని ఒప్పంద లెక్చరర్ల కూడా ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు .


మరింత సమాచారం తెలుసుకోండి: