నరేంద్ర మోడీ. ఆరెస్సెస్ కార్యకర్త స్థాయి నుంచి దేశాధినేతగా ఎదిగిన నాయకుడు. ఆయన ఇపుడు దేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడు. మోడీ ఎస్ అంటే ఎస్. నో అంటే నో. దేశంలో రెండవ అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ తన కాళ్ళను తానే విరగ్గొట్టుకున్నాక బీజేపీకి, మోడీకి ఎదురే లేదు.


అటువంటి మోడీ వినలేని మాట, అవును అన్నలేని మాట ప్రత్యేక హోదా. కానీ వైసీపీ ఎంపీలు జగన్ మాట మేరకు పార్లమెంట్ లో అడుగుతూనే  ఉన్నారు, . దీని మీద  కేంద్రం ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక తరగతి హోదా ఉనికే లేదని 14వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రత్యేక తరగతి హోదా అనేది ఇప్పుడు లేదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దీని స్థానంలో ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.


కేంద్ర ప్రాయోజిత పథకాలకు సమానంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు, విదేశీ ప్రాజెక్టులకు రీపేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ మేరకు 2015 నుంచి 2020 వరకు ప్రత్యేక సహాయం చేస్తాం. ఏపీ విభజన చట్టం అమలుపై ఇప్పటివరకు 23 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. విభజన చట్టం అమలు కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం’’ అని వివరించారు.


అంతకుముందు పార్లమెంట్‌లో చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్‌ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని  గుర్తుచేశారు. 


మరి ఈ మాటలు మోడీ మరచినా అయిదు కోట్ల మంది ఆంధ్రులు మరువలేదుగా. అందుకే వారి తరఫున నెగ్గిన ఎంపీలు అడుగుతూనే ఉంటారు. మోడీ వినలేను , అవును అనలేను అని చెప్పినా కూడా అడుగుతూనే ఉంటారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చేవరకూ అడుగుతూనే ఉంటారు. ఏపీలో బీజేపీకి  రాజకీయ హోదా కావాలంటే ప్రత్యేక హోదాతోనే అన్న వాస్తవం తెలియచెప్పేలా అడుగుతూనే ఉంటారు.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: