ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో కీల‌క నియామ‌కానికి ఓకే చెప్పేశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో ప‌ని చేసి ఏపీకి వ‌చ్చిన‌ ఏవీ ధర్మారెడ్డిని టీటీడీ జేఈవోగా నియమించారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌క ఫైలుపై జ‌గ‌న్ సంత‌కం చేశారు. 1991 బ్యాచ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్ (ఐఈడీఎస్)కు చెందిన ధర్మారెడ్డి గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చి టీటీడీ జేఈవో, ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో టీటీడీకి ధర్మారెడ్డి చేసిన సేవలకు మెచ్చిన సీఎం జగన్‌... ఆయనకు మరోసారి తిరుమలలో పనిచేసే అవకాశం ఇచ్చారు. 


ఇటీవల బదిలీ అయిన జేఈవో శ్రీనివాసరాజు స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. ఇదే స‌మ‌యంలో ధర్మారెడ్డికి కేంద్రం క్లియరెన్స్‌ ఇవ్వడంతో ఆయనకు టీటీడీ జేఈవోగా బాధ్యతలు అప్పగించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ధ‌ర్మారెడ్డి ఏపీలో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆమోదముద్ర వేస్తూ కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మే 14వరకు లేదా తదిపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఏపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఉంటారని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. కాగా కేంద్రం క్లియ‌రెన్స్ నేప‌థ్యంలో....ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంత‌కం చేశారు. రాబోయే ఒక‌ట్రెండు రోజుల్లో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 


ఇదిలాఉండ‌గా, తిరుమల తిరుపతి దేవస్థానంలో జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పోస్టులో నియమితులైన వారు ముఖ్యమంత్రి, మంత్రులతోనే నేరుగా సంబంధాలు కలిగి ఉంటారు. శ్రీవారి దర్శనానికి వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఆర్జితసేవా టికెట్లు కేటాయించే అధికారాలు జేఈవోకే ఉంటాయి. దీంతో రాజకీయ ప్రముఖులేకాదు. అంబానీల్లాంటి వ్యాపార దిగ్గజాలు కూడా జేఈవో కోసం ఎదురు చూడాల్సిందే. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జేఈవో పోస్టులో శ్రీనివాసరాజు 8 సంవత్సరాలు పాటు కొనసాగారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినా ఆయన మాత్రం తన సీటును కాపాడుకుంటూ వచ్చారు. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో శ్రీనివాసరాజు బదిలీ అనివార్యం అయ్యింది. దీంతో ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: