గన్నవరం నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ఇప్పుడు జగన్ తో భేటీ అవ్వటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థిపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన వంశీ... సన్మానం చేస్తానంటూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే వంశీ భావించినట్టుగా టీడీపీ అధికారంలోకి రాకపోగా... తాను మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో సన్మానం మాటను పక్కనపెట్టేసిన వంశీ... తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.


ఇప్పటికే ఈ దిశగా ఓ కీలక అడుగు వేసిన వంశీ... పోలవరం కుడి కాల్వ నుంచి రైతులకు నీరందించే విషయంపై జగన్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయం తేలకుండానే... వంశీ నేరుగా జగన్ తోనే భేటీ అయ్యి మరోమారు సంచలనం రేకెత్తించారు. ఈ సందర్భంగానూ తన నియోజకవర్గ ప్రజలకు తాగు - సాగు నీటిపై ఆయన జగన్ తో చర్చించారు.


పోలవరం కుడి కాల్వ ద్వారా తన నియోజకవర్గ రైతులకు సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన 500 మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని జగన్ ను అభ్యర్థించిన వంశీ... ఆ దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే... తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన సదరు 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు జగన్ కు చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: