ఎమ్మార్వో లావ‌ణ్య  గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నాలుగు లక్షలు తీసుకుంటూ విఆర్వో అంతయ్య పట్టుప‌డ‌గా ఈ కేసులోనే కేశంపేట్  తహశీల్థార్ లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతయ్య వెనుక లావణ్య పాత్ర ఉందని ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 93 లక్షల 50 వేల రూపాయలతో నగదు తో పాటు, 400 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో భారీమొత్తంలో నగదు పట్టుబడటం పదేళ్ల‌లో ఇదే ప్రథమం కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే, ఈ ఎపిసోడ్‌లో మ‌రిన్ని సంచ‌ల‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.


ఈ కేసులో ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది. బుధవారం రాత్రి వరకు హయత్‌నగర్‌లోని లావణ్య నివాసంలో తనిఖీలుచేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆమెను అరెస్టుచేశారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారణ పూర్తయిన తర్వాత లావణ్యను దవాఖానకు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తర్వాత బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో లావణ్యను హాజరుపరిచారు. న్యాయమూర్తి తాసిల్దార్ లావణ్యతోపాటు వీఆర్వో అనంతయ్యకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, లావణ్య భర్త వెంకటేశ్‌నాయక్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. అతడు జీహెచ్‌ఎంసీ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నారు.


కాగా, గతంలోనూ లావణ్యపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమె బాధితులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. గతంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు తన సమస్య పరిష్కరించాలంటూ ఎమ్మార్వో లావణ్య కాళ్లపై పడి వేడుకున్నాడు. తన సొంత భూమిని వేరేవాళ్లకు పట్టా చేశారని మరో బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: