నోట్ల క‌ట్ట‌లు...డ‌బ్బుల గుట్ట‌ల‌తో దొరికిపోయిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహ‌శీల్దార్ లావణ్య కేసు ఊహించ‌ని మ‌లుపు తిరుగుతోంది. ప‌బ్లిక్‌గా, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఎమ్మార్వో అవినీతి విష‌యంలో అన్ని అవ‌కాశాలు ఉప‌యోగించుకున్న‌ట్లు స‌మాచారం. బినామీ బాగోతాల‌కు సైతం ఆమె తెర‌లేపార‌ని స‌మాచారం. ఏకంగా ఏసీబీ సైతం ఆమె ఆఫీసులో ప్ర‌త్యేకంగా సోదాలు చేస్తోంది. 
కేశంపేట తాసిల్దార్ లావణ్యకు రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాల్టీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె దగ్గర బంధువు ఒకరు బినామీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారుల నుంచి సదరు ఉద్యోగికి ఫోన్లు రావడంతో ఆయన స్విచ్చాఫ్ చేసినట్టు సమాచారం. లావణ్య ఏసీబీకి దొరికినరోజు నుంచి ఈ ఉద్యోగి మున్సిపాల్టీలో విధులకు రావడం మానేశారు. ఈయన పనిచేస్తున్న విభాగంలో రూ.లక్షల అవినీతి జరుగుతున్నట్టు గతంలో ప్రజాప్రతినిధులు, సీపీఐ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం గమనార్హం.


కాగా, కేశంపేట తహ‌శీల్ధార్ కార్యాలయంలో అవినీతి కారణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారుల ఫైళ్ల పరిష్కారంపై ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. గత రెండ్రోజులుగా పెండింగ్ ఫైళ్లపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం 450కి పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా.. సంబంధిత రైతులను ఫోన్ల ద్వారా పిలిపించి, వివరాలు సేకరిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి, సమస్యపై రెవెన్యూ ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. 


అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో ఆమెపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకొంటుంది. తహ‌శీల్ కార్యాలయంలో భూ మార్పిడి, విరాసత్, పాత డాక్యుమెంట్ల మ్యుటేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల ఫైళ్లు కుప్పలు తెప్పలుగా ఉండిపోయాయి. కార్యాలయంలో డబ్బులిచ్చినవారి పనులు మాత్రమే తొందరగా పూర్తయ్యేవని రైతులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేశారు. తమ భూములకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదుచేయలేదని.. దీనితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము ప్రతిరోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. పనులుకావడంలేదని వాపోతున్నారు. 
తమ తండ్రి ఆస్తిలో తమకు రావాల్సిన వాటాను తాసిల్దార్ లావణ్య తమకు దక్కకుండా చేశారని చౌలపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. చౌలపల్లికి చెందిన సయ్యద్ యూసుఫ్‌బీకి సర్వే నంబర్ 73/అ లో 3.24 ఎకరాల భూమి ఉన్నది. ఆమెకు కుమారుడు సయ్యద్ సలాం, ముగ్గురు కుమార్తెలు షహాజాదీ ఉన్నిసా, యాస్మిన్‌బేగం, బిస్మిల్లా ఉన్నారు. భూమిలో వాటా కావాలని ముగ్గురు కుమార్తెలు తల్లిని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారు తాసిల్దార్‌కు ఏప్రిల్ 19న ఫిర్యాదుచేశారు. తాసిల్దార్ వారి అభ్యంతరాన్ని లెక్కచేయకుండా యూసుఫ్‌బీ కొడుకు పేరిట పట్టాచేస్తూ ఏప్రిల్ 24న ప్రొసీడింగ్ ఇచ్చారు. తాసిల్దార్ లావణ్య, అప్పటి వీఆర్వో రాములు సయ్యద్ సలాం వద్ద డబ్బు తీసుకుని భూమిని అతని పేరిట పట్టాచేశారని బాధితులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తండ్రి ఆస్తిలో కూతుళ్లకు రావాల్సిన వాటాపై విచారణ చేపట్టాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: