గత కొంత కాలంగా కార్పొరేషన్ ఉద్యోగులు టిప్ టాప్ గా తయారై వచ్చి, ఏసీ రూమ్ లలో కూర్చుని టిక్ టాక్ వీడియోలను తీసుకుంటూ, విధులను పక్కన పెట్టిన వారంతా ఇప్పుడు పోలోమని పొద్దున్నే లేచి నగర వీధుల శుభ్రతపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. పారిశుద్ధ కార్మికులతో పని చేయిస్తూ నగర పరిశుభ్రత కోసం నాలుగు రోడ్లు తిరగాల్సి ఉంది.

ఖమ్మం కార్పోరేషన్‌లో కొంతమంది ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి, టిక్ టాక్‌లో టాలెంట్ చూపిస్తున్న విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. డ్యాన్సులు, డైలాగ్ లతో పాటు టిక్ టాక్ యాప్ లో వీడియోలు ఆప్ లోడ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్న అధికారుల తీరుపై గత కమిషనర్ కూడా కొందరిని హెచ్చరించారు. మరి కొందరికి నోటీసులు ఇచ్చారు.

అయినా అక్కడి సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు కనిపించటం లేదు. కార్పొరేషన్లో శానిటేషన్ పనులు , రోడ్ల పనులు , జనన మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు కోసం ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం వచ్చే వారికి మాత్రం తాము బిజీ బిజీగా ఉన్నామంటూ ఘాటుగా సమాధానం చెబుతూ టిక్ టాక్ లతో బిజీ అయిపోయిన అధికారులకు చుక్కలు చూపించే పనిలో పడ్డారు ఉన్నతాధికారులు.

మొత్తానికి టిప్ టాప్ గా రెడీ అయ్యి టిక్ టాక్ లతో హల్ చల్ చేసే వారు ఇక ఆఫీసుల్లో కూర్చునే సుఖానికి స్వస్తి చెప్పాల్సి వస్తుంది . నాలుగు రోడ్లు తిరిగి వీధుల్ని శుభ్రం చేయించాల్సి వుంది. డ్రైనేజ్ లు ,చెత్త కుండీలు శుభ్రత అన్నీ ఇక వారి అండర్ లోనే .. మొత్తానికి కమీషనర్ అధికారుల టిక్ టాక్ పిచ్చి కుదిర్చే నిర్ణయం తీసుకున్నారని అందరూ అభినందిస్తున్నారు.

వారి టిక్ టాక్ తిక్క కుదర్చటానికి ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి సెక్షన్లు, డిపార్టుమెంట్లు మార్చారు. సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడిందని విమర్శలు రావడంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు వారి సెక్షన్లను మార్చారు. ఆ తరువాత కూడా వీరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటంతో, ఈ వీడియోలు చేసిన అందరినీ శానిటేషన్ విభాగానికి మారుస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: