నాల్గోరోజు ప్రారంభమైన సమావేశాలు తెలుగుదేశం, వైసీపీ మధ్య గందోరగోళానికి దారి తీసింది. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలోనే మంత్రి పేర్ని నాని ఆటో కార్మికుల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న వ‌రాల గురించి వివరిస్తూ..అచ్చెన్నాయుడు గురించి ప్ర‌స్తావించ‌టంతో రెండు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది మ‌రింత‌గా పెరిగి..అచ్చెన్నాయుడు స్పీక‌ర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు స్పీక‌ర్‌ను ప్ర‌శ్నించిన విధానం పైన వైసీపీ నేత‌లు మండి ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్..రోజా ఉదంతాల‌ను స‌భ‌లో వైసీపీ స‌భ్యులు ప్ర‌స్తావించారు. విప్ చెవిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కేశ‌వ్ మ‌ధ్య స‌వాళ్లు చోటు చేసుకున్నాయి.

మంత్రి పేర్ని నాని ఆటో కార్మికుల‌కు రూ.400 ప్ర‌భుత్వం నుండి అందిస్తున్న సాయంపైన రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తున్న స‌మ‌యంలో కొన్ని వ్యాఖ్య‌లు చేసారు. త‌మ‌ను దూషించారంటూ అచ్చెన్నాయుడు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ‌కు మాట్లాడే అవ‌కావం ఇవ్వాల‌ని నినాదాలు చేసారు. ఆ స‌మ‌యంలో అచ్చెన్నాయుడు మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌భ‌లో ప్ర‌స్తావించారు. దీనికి కొన‌సాగింపుగా తాను ఏం మాట్లాడాలో స్పీక‌ర్ ను రాసివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి వైసీపీ నేత‌లు సైతం తీవ్రంగా ప్ర‌తిస్పందించారు. దీంతో.. అచ్చెన్నాయుడు త‌మ‌ను వైసీపీ నేత‌లు బెదిరిస్తున్నార‌ని..బ‌య‌ట‌కు రా చూసుకుందాం అంటున్నార‌ని..ఇదేమైనా ముష్టి యుద్ద‌మా అని ప్ర‌శ్నించారు. దీంతో.. మంత్రి పేర్ని నాని తాను ఏదైనా త‌ప్పుగా మాట్లాడితే వెన‌క్కు తీసుకుంటా న‌ని..ఎవ‌రి మ‌న‌సు అయినా నొప్పించి ఉంటే క్ష‌మాప‌ణ చెబుతాన‌ని చెప్పారు.

నాడు చంద్ర‌బాబు వెన్నుపోటు స‌మ‌యంలో అసెంబ్లీలో ఎన్టీఆర్‌కే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. విప్ చెవిరెడ్డి నాడు స‌భ‌లో ఎటువంటి వివ‌ర‌ణ‌కు అవకాశం లేకుండా రోజాను ఏడాది పాటు స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని గుర్తు చేసారు. ఆ స‌మ‌యంలో స‌భా నిర్వ‌హ‌ణ పైనా చెవిరెడ్డి... ప‌య్యావుల కేశ‌వ్ మ‌ధ్య స‌వాళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో..స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం జోక్యం చేసుకొని అచ్చెన్నాయుడు త‌న‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధిస్తారా అంటూ నేరుగా చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. స్పంద‌గా చంద్ర‌బాబు తాను స‌మ‌ర్ధించ‌న‌ని..అదే స‌మ‌యంలో రామ‌చంద్రారెడ్డి త‌న గురించి ఎన్టీఆర్ ను ప్ర‌స్తావిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్దిస్తారా అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. దీని పైన వైసీపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. ప్ర‌తిప‌క్ష నేత తీరుపైన మండిప‌డ్డారు.

ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉన్న చంద్ర‌బాబు నేరుగా స్పీక‌ర్ ను మీరు వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌ను స‌మర్ధిస్తారా అని ప్ర‌శ్నించ‌టం పైన అంబ‌టి రాంబాబు స్పందించారు. ఇంత అనుభ‌వం ఉన్న వ్య‌క్తి స్పీక‌ర్ ను ప్ర‌శ్నించ‌టం ఏంట‌ని నిల‌దీసారు. ప్ర‌తిప‌క్ష నేత కావాలంటే ఆ ప్ర‌శ్న‌ను ముఖ్య‌మంత్రిని అడ‌గ‌వ‌చ్చ‌ని..స్పీక‌ర్‌ను అడిగే అధికారం లేద‌ని చెప్పుకొచ్చారు. విప్ చెవిరెడ్డి సైతం గ‌త సమావేశాల్లో తాను బంట్రోతు అని చేసిన వ్యాఖ్య‌ల పైన ముఖ్య‌మంత్రి మంద లించార‌ని..ఏంటి భాస్క‌ర్ నీవు కూడా అచ్చంనాయుడులా మాట్లాడుతున్నావ్ అంటూ అడిగార‌ని చెవిరెడ్డి స‌భ‌లోనే చెప్పుకొచ్చారు. ఆ త‌రువాత మంత్రి బుగ్గ‌న చేసిన సూచ‌న‌తో స‌భలో తిరిగి ప్ర‌శ్నోత్త‌రాలు మొద‌ల‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: