ఇప్పటి వరకు కర్ణాటకలో రాజకీయం ప్రతిక్షణం ఎంతో ఉత్కంఠంగా సాగుతుంది.  ఏ క్షణంలో ఎలాంటి మార్పులు చేర్పులు సంబవిస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది.  ప్రస్తుత సీఎం కుమార స్వామి ఉంటాడా..అవిశ్వాస తీర్మాణంతో పదవి నుంచి వైదొలుగుతాడా ఉన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.  గత పది రోజుల నుంచి కర్ణాటక రాజకీయాల్లో ఇదే తంతు కొనసాగుతుంది.  తాజాగా ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది.


రాజీనామాల నిర్ణయాధికారం స్పీకర్‌దేనని స్పష్టం చేసింది. అయితే గురువారం జరగబోయే బల పరీక్షకు వెళ్లడం.. వెళ్లకపోవడం అనేది ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది.  రేపు కుమారస్వామి సర్కార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. సభలో ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానంపై ఎంత మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


కాగా, ఇప్పటికే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమ పిటిషన్‌లలో ఆరోపించిన సంగతి తెలిసిందే. సుప్రీమ్ తీర్పు ప్రకారం ఇక ఎమ్మెల్యేల రాజీనామాల అంశం నిర్దిష్ట కాలపరిమితిని విధించుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.  మరోవైపు తన ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఢోకా లేదని సీఎం కుమారస్వామి ధీమాతో ఉన్నారు. సభలో మెజారిటీని నిరూపించుకుంటానని ఇదివరకే ప్రకటించారు. కాగా, రెబెల్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలా.. వద్దా అన్న విషయమై నిర్ణయాధికారాన్ని కోర్టు వారికే వదిలేయడంతో.. కుమారస్వామి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్న వార్తలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: