ఆ లేఖ తప్పు :
టీటీడీ చైర్మన్‌ ' అమరావతిలో నెలకొల్పేది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ క్యాంపు కార్యాలయం కాదని, టీటీడీ సమాచార కేంద్రం మాత్రమే , సోషల్‌మీడియాలో తనపై జరుగుతున్నది తప్పుడు ప్రచారం...' అని అంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. రాజధానిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని, అందులో ఆరుగురు సిబ్బందిని కేటాయించాలని చైర్మన్‌ కోరినట్టు.. విజయవాడ లోకల్‌ టెంపుల్స్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవో నుంచి టీ టీడీకి లేఖ అందిన విషయం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

దీని పై వైవీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దేవునికి భక్తులు ఇచ్చే విరాళాలు ఇలా అనవసర ఖర్చులకు ఉపయోగిస్తున్నారని, ఈ అంశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రాజధానిలో చైర్మన్‌ క్యాంపు కార్యాలయం ఏమిటని పలువురు ప్రశ్నించారు. దీనికి వైవీ సమగ్ర వివరణ ఇచ్చారు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డితో కలిసి చైర్మన్‌ వైసీ సుబ్బారెడ్డి స్థానిక అన్నమయ్య భవనంలో మీడియాకు వివరణ ఇచ్చారు.

''హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీలో టీటీడీ సమాచార కేంద్రాలు ఉన్నాయి. మరి అమరావతిలో వద్దా? విపక్ష నేత చంద్రబాబు ఎంతో ప్రేమతో అమరావతిని రాజధాని చేస్తే అక్కడ టీటీడీ ఆఫీసు పెట్టొద్దంటారా? ఎందుకు ఇంత అక్కసు? చైర్మన్‌ క్యాంపు ఆఫీస్‌ రాజధానిలో కావాలని నేను కోరలేదు. ఆ లేఖ తప్పు. నేను కోరానన్న లేఖ వాస్తవం కాదు. విచారణకు ఆదేశించా .ఇదివరకు హైదరాబాద్‌లో సమాచార కేంద్రం ఉండేది. ఇప్పుడు అమరావతిలో కూడా పెట్టాలని ఈవోను కోరా. అంతే' అని చెప్పారు.

తాను దేవుడి సొమ్ము స్వాహా చేస్తున్నారంటూ 'నారా లోకేశ్‌ సేన' పేరుతో ట్విట్టర్‌లో వచ్చిన పోస్ట్‌పై చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి సొమ్ము ఒక్కపైసా కాదు కదా, దేవుడికి నా జేబులో నుంచే ఖర్చు చేస్తున్నా. వాళ్లలా మేము దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు' అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: