తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీలో శుక్రవారం నూతన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించిన తెలంగాణ స‌ర్కారు ఎన్నిక‌ల‌కు క‌దులుతోంది. అయితే, స‌హ‌జంగానే అధికార పార్టీ అంటే టికెట్ కోసం పోటీ ఎక్కువ‌గానే ఉంటుంది. అలాంటి పోటీతో గ్రూపు రాజ‌కీయాలు కూడా స‌హ‌జం. అయితే, వీట‌న్నింటినీ టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముందుగానే ప‌సిగట్టారు. త‌న పార్టీ నేత‌ల‌కు వార్నింగ్ వంటి సూచ‌న చేశారు. పురపాలక ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకు కేటీఆర్ తేల్చిచెప్పారు. 


సిరిసిల్లలో నేడు జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది సోమవారం తెలుస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వార్డులన్నీ మనం గెలవాల్సిందేనని సూచించారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల కళ్లముందు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పోటీకి ఎవరు సమర్థులు అనే సమాచారం తన వద్ద ఉందని.. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలన్నారు. నాలుగు రోజుల్లో అన్నీ వార్డుల్లో బూతు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిరిసిల్లలో ఉన్న 117 పోలింగ్ బూత్‌లకూ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
 


 కొత్త చట్టం అవినీతిని పారదోలుతుందని, మున్సిపాలిటీల్లో రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందుతాయని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ మొండివారని, అనుకున్నది సాధిస్తారని, అవినీతి చీడ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడమే ఆయన ధ్యేయమని తెలిపారు. ``నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో స్టేలు వచ్చాయి. ఇప్పుడా అవకాశం ఉండదు. టీఎస్‌ఐపాస్ మాదిరిగానే మున్సిపల్ చట్టం కూడా విజయవంతంగా అమలవుతుంది``` అని కేటీఆర్ పేర్కొన్నారు. ``అభివృద్ధి అంటే ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టడమో లేక ఇంకేమైనా కొన్ని పనులు చేయడమో కాదు. అర్థవంతమైన పాలనా సంస్కరణలు తేవడం చాలా కీలకం. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్నది ఇదే. పంచాయతీరాజ్ చట్టమైనా.. కొత్త మున్సిపల్ చట్టమైనా.. రేపు రాబోయే కొత్త రెవెన్యూ చట్టమైనా.. ఇవన్నీ సమర్థంగా అమలైతే ఎమ్మెల్యేలకు గౌరవం పెరుగుతుంది. మంచి సంస్కరణలతో పాలనా వికేంద్రీకరణ జరుగుతుంది. అవినీతి పీడ నుంచి సామాన్యుడికి విముక్తి కల్పించాలన్న సీఎం కేసీఆర్ నిబద్ధత కొత్త మున్సిపల్ చట్టంలో ప్రతిబింబిస్తున్నది. ఆయన మొండితనం, సంకల్పం గురించి తెలిసినవారు ఎవరైనా ఈ చట్టాన్ని జాగ్రత్తగా చదువుకొని ఎన్నికల్లో దిగితే మంచింది. తప్పు ఎక్కడ జరిగినా క్షమించేది లేదు.`` అని తేల్చిచెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: