ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం తర్వాత అధిక ప్రాధాన్యం తమ ప్రభుత్వం చేనేత రంగానికి ఇస్తోందని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చేనేతల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. గతంలో చేనేతల కోసం వైఎస్‌ జగన్‌ దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

చేనేతరంగానికి రూ. వెయ్యికోట్ల స్థీరికరణ నిధిని ఏర్పాటు చేస్తానని.. ప్రతి ఏడాది వెయ్యి కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తన హయాంలో కేవలం సుమారుగా రూ. 875.3 కోట్లను మాత్రమే కేటాయించి.. రూ. 473 కోట్లు మాత్రమే నేతన్నల కోసం ఖర్చు చేశారని, మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మొదటి బడ్జెట్‌లోనే చేనేత రంగానికి రూ. రెండువందల కోట్లు కేటాయింపులు చేశారని, చేనేత రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మెగా క్లస్టర్లను ఏర్పాటుచేస్తామని ప్రకటించగా.. టీడీపీ హయాంలో వాటిని బ్లాక్‌స్థాయి క్లస్టర్లుగా మార్చారని, దీనివల్ల ప్రయోజనం లేదని, బ్లాక్‌స్థాయి క్లస్టర్ల వల్ల చాలా తక్కువమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెగా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇక గత సీఎం చంద్రబాబు హయాంలో ఆప్కో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, దీనిని ఆదుకోవాల్సిన అవసరముందని కోరారు.

దీనికి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సమాధానమిస్తూ.. మెగా క్లస్టర్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వీటిని కేంద్రం రద్దు చేసి.. బ్లాక్‌స్థాయి క్లస్టర్లను తీసుకొచ్చిందని తెలిపారు. ఇక, ఆప్కో రంగంలో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టినవిధంగా చర్యలు తీసుకొని.. దీనికి పునర్వైభవాన్ని తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిశ్చయించారని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: