ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నవేళ సస్పెన్షన్ల పర్వం కూడా ప్రారంభమైంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సమయంలో సభా నిర్వహణకు పదే పదే అడ్డు తగులుతున్నారన్న కారణంతో ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉపసభాపతి సస్పెండ్ చేశారు.


అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. .. తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉపసభాపతి కోన రఘుపతి ప్రకటించారు. వారు తమ స్థానాల నుంచి వెళ్లక పోవడంతో మార్షల్స్ ను ప్రయోగించాల్సి వచ్చింది.


సస్పెన్షన్ తర్వాత బయటకు వస్తున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎదురుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు బుచ్చయ్య, అచ్చెన్న, నిమ్మల కొద్దిసేపు మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో మార్షల్స్ లోపలికి రాలేదని గోరంట్ల గుర్తు చేశారు.


దీనిపై స్పందించిన అంబటి రాంబాబు.. నాకు తెలీదు.. ఇప్పుడే వస్తున్నా కంగ్రాట్స్ అంటూ కరచాలనం చేశారు. 40 రోజుల్లోనే సస్పెండయ్యేలా గొడవ జరపడం దేనికని అంబటి వారిని ప్రశ్నించారు. వారితో కొద్దిసేపు మాట్లాడిన అంబటి.. మళ్లీ వచ్చే సెషనులో కలుద్దామంటూ సభలోకి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: