జూలై 24న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ నినాదాన్ని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్ స్ఫూర్తిగా తీసుకున్నారు. కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. త‌ద్వారా బ‌ర్త్‌డే వేడుక‌ల్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు.


తన పుట్టిన రోజు సందర్భంగా పూల బొకేలు, పత్రికా ప్రకటనలు కాకుండా అవసరమున్న పేదలకు లేదా సమాజంలోని వివిధవర్గాలకు సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పుట్టినరోజు (జూలై 24)ను పురస్కరించుకొని కేటీఆర్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ పేరుతో ట్విట్టర్ వేదికగా వినూత్నమైన ప్రచారాన్ని గతంలోనే ప్రారంభించారు. దీనికి అన్నివర్గాల నుంచి విస్తృతమైన ఆదరణ లభిస్తున్నది. ఈ చాలెంజ్‌లో భాగంగా తమకు తోచినంత సహాయాన్ని చుట్టుపక్కలవారికి అందించడంతోపాటు మీరు కూడా ఇలా చేయండి అంటూ తమకు తెలిసిన వారిని నామినేట్ చేస్తున్నారు. ఇలా నామినేట్ చేసినవారు సైతం ఎంతోకొంత ఇతరులకు సహకారం అందించేందుకు ముందుకొస్తున్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ఆలోచనకు నెటిజన్ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది.


అయితే, కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఆయ‌న సోద‌రుడు సంతోష్ అడ‌విని ద‌త్త‌త తీసుకున్నారు. ప్రభుత్వం అటవీశాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధిలో భాగంగా కీసరగుట్ట అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును సొంత నిధులతో తీర్చిదిద్దుతాం అని సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి.. అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు అద్భుతంగా ఉన్నాయి. పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకునేందుకు ఈ పార్కులు తోడ్పడుతాయి. వారాంతాల్లో కుటుంబంతో సహా సేదతీరే చక్కని ప్రాంతాలుగా పిల్లల్లో పర్యావరణం, అటవీ, జీవవైవిధ్యం ప్రాధాన్యతలు తెలుసుకునే ప్రాంతాలుగా అర్బన్‌ ప్రాంతాల అభివృద్ధి జరుగుతోంది. కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని మంచి ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్ది హైదరాబాద్‌ వాసులకు బహుమతిగా ఇస్తాం. యాదాద్రి, కీసరగుట్టలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు కూడా ఈ ఎకో టూరిజం పార్కు అందుబాటులో ఉంటుంది.` అని సంతోష వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: