తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై మళ్లీ ఊహగానాలు మొదలయ్యాయి. ఆగ‌స్టు చివ‌రి వారం లేదా ద‌స‌రాకు ముందుగానే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ విస్త‌ర‌ణ‌లో ఈ సారి అనూహ్య‌మైన మార్పులు, చేర్పులు ఉండొచ్చ‌ని అంటున్నారు. కేసీఆర్ కేబినెట్లోకి ఇన్ అయ్యే వాళ్ల‌లో మేన‌ళ్లుడు హ‌రీష్‌రావుతో పాటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కుమారుడు కేటీఆర్ ఉండ‌నున్నారు. వీరిద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఖాయం కానున్నాయి. 


ఇక క‌మ్మ కోటాలో మంత్రి ప‌ద‌వి కేసీఆర్ మ‌ళ్లీ తుమ్మ‌ల‌తోనే భ‌ర్తీ చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. అలాగే శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ పేరు కూడా విన‌ప‌డుతున్నా కేసీఆర్ తుమ్మ‌ల వైపే మొగ్గు చూప‌వ‌చ్చ‌ని టాక్‌. ఇక మ‌హిళా కోటాలో మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డికి ప‌ద‌వి ఖాయ‌మైన‌ట్టే. ఇక న‌ల్గొండ నుంచి ఇప్ప‌టికే జ‌గ‌దీశ్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయ‌న‌తో పాటు తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఇటీవ‌ల గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఎమ్మెల్సీ అవుతున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని గులాబీ వర్గాల మాట.


ఇక గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి ఎంట్రీ కావ‌డంతో ఇద్ద‌రు రెడ్డి మంత్రుల‌పై వేటు త‌ప్ప‌దంటున్నారు. కేబినెట్‌లో మొత్తం ఐదుగురు రెడ్లు ఉన్నారు. వీరిలో నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరిని తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. వీరిలో నిరంజ‌న్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, ప్ర‌శాంత్‌రెడ్డి కొత్త‌వారు. మిగిలిన ఇద్ద‌రు మంత్రులు గ‌త కేబినెట్‌లో కూడా ఉన్నారు. దీంతో కేసీఆర్ వీరిలో ఎవ‌రిని త‌ప్పించాల‌న్న‌దానిపై ఓ నిర్ణ‌యానికి కూడా వ‌చ్చేశారంటున్నారు.


ఇక ఎస్టీ కోటాలో కూడా ఓ మంత్రిని నియ‌మించాల్సి ఉంది. ఎస్టీ కోటాలో మ‌హిళ‌ల‌కు కూడా ఛాన్స్ ఇచ్చే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే అజ్మీరా రేఖా శ్యాం నాయ‌క్ రేసులో ఉన్నారు. ఇక మున్నూరు కాపుల నుంచి కూడా ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చంటున్నారు. తాజా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి ఈ సామాజిక‌వ‌ర్గం త‌ర‌పున మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నిక‌య్యారు. వీరిలో దానం నాగేంద‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్ లాంటి వాళ్లు ముందున్నారు. ఇక తాజా మార్పుల్లో నిజామ‌బాద్ లోక్‌సభ ఫ‌లితం ప్ర‌భావం కూడా ఉందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: