గ‌త నెల‌లో సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. చండీగఢ్‌లో ఉన్ జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటిపళ్లు తిన్నాడు. అయితే ఆ అరటి పళ్ల బిల్లు చూసి కళ్లు తేలేసాడు. ఆ రెండు అరటిపళ్లకు హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలపి ఏకంగా రూ.442.50 బిల్లు వేసింది. ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా ఇది నెట్టింట తెగ హల్‌చల్‌ చేసింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయితే, తాజాగా ఇదే రీతిలో . ముంబైలోని ఓ హోటల్‌ రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఏకంగా 1700 రూపాయల(ఒక్కోటి రూ. 850) బిల్లు వేసింది. 


ముంబైలోని ఫోర్‌ సీజన్స్‌ అనే హోటల్‌కు వెళ్లిన కార్తీక్‌ ధార్‌ అనే వ్యక్తి ఉడకబెట్టిన రెండు కోడిగుడ్లను ఆర్డర్‌ ఇచ్చాడు. వాటికి హోటల్‌ వేసిన బిల్లును చూసి ఖంగుతిన్నాడు. ఆ హోటల్‌ రెండు కోడిగుడ్లకు రూ.1700 బిల్లు వేసింది మరి! అంతేకాదు.. ఆమ్లెట్లకూ ఆ హోటల్‌ యాజమాన్యం రూ. 850 వసూలు చేసింది. దీనికి జీఎస్టీ అదనం. ఈ హోటల్‌ బిల్లు రశీదులను కార్తీక్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాక ఈ ట్వీట్‌ని రాహుల్‌ బోస్‌(అరటి పండ్లకు రూ. 442 చెల్లించిన బాలీవుడ్‌ నటుడు)కి ట్యాగ్‌ చేసి, ‘సోదరా.. ఆందోళన చేద్దామా?’ అని చమత్కరించాడు. ఈ ఘటనపై సదరు హోటల్‌ యాజమాన్యం ఇంకా స్పందించ‌లేదు.


ఇదిలాఉండ‌గా, రెండు అరటిపళ్లకు జీఎస్టీ అంటూ రూ.442.50 బిల్లు వేశారని  రాహుల్ బోస్‌ చేసిన ట్వీట్‌పై ఎక్సైజ్‌-పన్నుల శాఖ స్పందించిన సంగ‌తి తెలిసిందే. రెండు అరటి పళ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హోటల్‌పై చర్యలు తీసుకుంది. జీఎస్టీ పరిధిలోకి రాని అరటిపళ్లపై జీఎస్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రూ.25వేల జరిమానా విధించింది.  మ‌రి తాజా ఉదంతంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: