అప్పుడప్పుడు సమాజాంలో కొన్ని హృదయాలు కదిలించే సంఘటనలు జరుగుతుంటాయి.. అలాంటిదే ఈ వార్త. ఆ అవ్వకు ఆకలేసింది... చెప్పుకొందామంటే ఎవరూ లేరు... మంచంపై నుంచి కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు ఇక ఆకలిని భరించలేక ఆమె ఉంటున్న మేడపై నుంచి దూకి ఆకలి తీర్చుకోవాలనుకుంది. ఇది చూసిన స్థానికులు వెంటనే ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే... పార్వతీపురం పట్టణంలోని బందంవారి వీధిలో వారణాసి భూదేవి తన ఇంట్లో ఉంటోంది. ఈమెకు కుమారులు లేకపోవడంతో కుమార్తెలే యోగక్షేమాలను చూస్తుంటారు. వృద్ధురాలు మాత్రం ఒంటరిగా ఇంటి మేడపైనే నివసిస్తోంది.

స్థానికంగా ఉంటున్న కుమార్తె ఎప్పుటిలాగే ఆదివారం ఉదయం ఆహారం అందించి వెళ్లిపోయారు. సాయంత్రం అయ్యేసరికి వృద్ధురాలికి ఆకలి తీవ్రంగా వేయడం, ఎలాంటి ఆహారం లేకపోవడంతో ఇక భరించలేకపోయింది. మేడపై నుంచి మెట్లు మీదుగా కిందకు దిగేందుకు అక్కడ తలుపునకు తాళం వేసి ఉంది. కిందకు వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడ నుంచి కిందకి దూకి ఆకలి బాధను తీర్చుకోవాలనుకుంది. ఈ సమయంలో వృద్ధురాలిని చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని పట్టణ పోలీసులకు తెలియజేశారు. వెంటనే పట్టణ మహిళా ఎస్‌ఐ జయంతి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.

పరిస్థితిని సమీక్షించిన ఆమె వెంటనే ఓ యువకుడిని నిచ్చెన సాయంతో వృద్ధురాలు వద్దకు పంపించి జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్లారు. తనకు ఆకలేస్తుందని, అందుకే కిందకు దిగాలనుకుంటున్నట్లు వృద్ధురాలు పేర్కొంది. పోలీసులు స్థానికుల సహకారంతో పండ్లు, కొంత ఆహారం పంపించారు. ఆహారం తీసుకున్న తరువాత ఆమె సేదతీరింది. అయితే గత కొంతకాలంగా వృద్ధురాలు మతిస్థిమితం కోల్పోయి ఇంట్లోనే ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులతో తాను బాగానే ఉన్నానని మేడపై నుంచి కిందకు చూశానని చెప్పినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జయంతి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: