రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుల పునరేకీకరణ జరగబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానం పెరుగుతోంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్షాలు తెలుగుదేశంపార్టీ, బిజెపిలతో పవన్ కల్యాణ్ కూడా కలిసిన విషయం అందరకీ తెలిసిందే. అందరూ కలిసి ఏదో విధంగా జగన్ ను ఓడించారు.

 

సీన్ కట్ చేస్తే ఐదేళ్ళు గిర్రున తిరిగిపోయింది. 2019 ఎన్నికల్లో అప్పటి మిత్రులు విడిపోయి ఎవరిదారిన వాళ్ళు పోటీ చేశారు. 2014లో మిత్రులు అధికారంలోకి వచ్చింది చాలా కొద్దిపాటి తేడాతో మాత్రమే అన్న విషయాన్ని మరచిపోయారు. ఎవరికి వారు తాము చాలా బలవంతులమని విర్రవీగారు. చివరకు ఏమైంది ? ఏమంది జగన్ దెబ్బకు అందరూ కళ్ళు తేలేశారు.

 

మొన్నటి ఎన్నికల్లో జగన్ దెబ్బకు చంద్రబాబునాయుడు చావుదెబ్బతిని కేవలం 23 మంది ఎంఎల్ఏలతో బయటపడ్డారు. ఇక బిజెపి ఎన్ని సీట్లలో డిపాజిట్లు తెచ్చుకుందో వాళ్ళకే తెలియదు. తనను తాను ఎక్కువగా ఊహించుకున్న పవన్ కల్యాణ్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే. పవన్ పోటి చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. 140 నియోజకవర్గాల్లో పోటి చేసిన జనసేన ఒక్క చోట మాత్రమే గెలిచింది.

 

స్ధూలంగా చెప్పాలంటే రాష్ట్రంలో జగన్ ను ఎదిరించగలిగిన గట్టి ప్రతిపక్షం లేదనే చెప్పుకోవాలి.  మ్యానిఫెస్టోలో చెప్పినవి, పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కోదాన్ని జగన్ నెరవేర్చే పనిలో పడ్డారు. మొత్తానికి జగన్ పాలనతో మామూలు జనాలైతే హ్యాపీగానే ఉన్నట్లు కనబడుతోంది. అందుకనే రాజకీయ పార్టీలు మండిపోతున్నాయి.

 

ఈ నేపధ్యంలోనే ముందు చంద్రబాబు, తర్వాత బిజెపి తాజాగా పవన్ జగన్ కు వ్యతిరేకంగా గొంతులిప్పుతున్నారు. వీళ్ళ వరస చూస్తుంటే విడివిగా ఉంటే జగన్ ను ఎదుర్కోవటం కష్టమని డిసైడ్ అయినట్లుంది. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా కలుస్తున్నారు. చూడబోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ కు వ్యతిరేకంగా ఏకమయ్యేట్లే అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: