అచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మి ప్ర‌సాద్‌ ను అధికార భాషా సంఘం అధ్య‌క్షునిగా నియ‌మిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ కాగా, రెండు సంవ‌త్స‌రాల పాటు  ల‌క్ష్మి ప్ర‌సాద్  ఈ పదవిలో కొన‌సాగుతారు.  మంగళవారం జివో ఎంఎస్ నెంబర్ 10ను విడుదల చేసిన పర్యాటక శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికార భాషా సంఘంలో నలుగురు సభ్యులను కూడా నియమించే వెసులుబాటును కల్పించారు.  పూర్వ రాజ్య‌స‌భ స‌భ్యునిగా, కేంద్ర ప్ర‌భ‌త్వం నుండి ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాల‌ను అందుకున్న వైఎల్‌పి అటు తెలుగు, హిందీ సాహిత్య రంగాల‌కు చేసిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి. ద‌క్షిణాదికి చెందిన హిందీ భాషాభిమానిగా అచార్య యార్ల‌గ‌డ్డ దేశ స‌మ‌గ్ర‌త‌ను పెంపొందించేలా సాహిత్య సేవ‌ల‌ను అందించారు. తెలుగు సాహిత్యం ఉత్త‌రాది వారికి అవ‌గ‌తం కావాలంటే మ‌న సాహిత్య ప్ర‌క్రియ‌ల‌ను హిందీలోకి అనువదింప‌చేయాల‌న్న ఆలోచ‌న‌ల‌కు ఆద్యునిగా ఉండి, అష్టావ‌ధానం, శ‌తావ‌ధానం వంటి ప్ర‌క్రియ‌లను అనువ‌దించి హిందీలో ప్ర‌చురింప‌చేయ‌టం ద్వారా మ‌న తెలుగు గొప్ప‌ద‌నాన్ని ఉత్త‌రాదికి ప‌రిచ‌యం చేసారు.  హిందీలో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ప‌లు పుస్త‌కాల‌ను తెలుగులోకి అనువ‌దించి దేశంలోని ఇరు ప్రాంతాల న‌డుమ సాహిత్య వార‌ధిగా వ్య‌వ‌హ‌రించారు. దివంగ‌త ముఖ్యమంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి గ‌తంలోనే యార్ల‌గ‌డ్డ ప్ర‌తిభ‌ను గుర్తించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హిందీ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా నియ‌మించి గౌర‌వించ‌గా, త‌రువాతి ప్ర‌భుత్వాలు అకాడ‌మీని నిర్వ‌హ‌ణ‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు తిరిగి యార్లగడ్డ సేవలను ముఖ్యమంత్రి వైె ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రూపంలో వినియోగించుకోదలిచారు. సిఎం ఆకాంక్షల మేరకే యార్లగడ్డ ప్రత్యేకంగా అధికార భాషా సంఘం ఛైర్మన్ గా నియమితులయ్యారంటే అతిశయోక్తి కాదు. ప్ర‌స్తుతం అచార్య యార్ల‌గ‌డ్డ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఛైర్మ‌న్‌గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్ధ‌లో స‌భ్యులుగా  సేవ‌లు అందిస్తున్నారు. 
యార్ల‌గ‌డ్డ అంత‌ర్జాతీయ స్ధాయిలోనూ తెలుగు భాషా, సాహిత్యం, సంస్కృతి ఉన్న‌తికి ఇతోధికంగా పాటు ప‌డ్డారు. వివిధ దేశాల‌లో తెలుగు మ‌హాస‌భ‌ల‌ను నిర్వ‌హించ‌ట‌మే కాకుండా, దేశ రాజ‌భాష హిందీకి ప్రాచుర్యం క‌లిగించే క్ర‌మంలో నిరంత‌ర ప్ర‌యాణికుడుగా మారారు. మూడు ద‌శాబ్దాలుగా హిందీ కోసం లక్ష్మి ప్ర‌సాద్ ప‌డిన త‌ప‌న ఎంచ‌లేనిది. సాధారణంగా ఏదో ఒక భాష‌లో డాక్ట‌రేట్ ఉండ‌టం స‌హ‌జం అందుకు భిన్నంగా యార్ల‌గ‌డ్డ తెలుగు, హిందీ భాష‌ల‌లోడాక్ట‌రేట్ అందుకున్నారు. ఆంధ్రా యూనివ‌ర్శిటీ హిందీ విభాగ అధిప‌తిగా ఆయ‌న  వేలాది మంది విధ్యార్ధుల అభిమానాన్ని చూర‌గొన్న ఆయన తన సంప‌ద త‌న విధ్యార్ధులేన‌ని గ‌ర్వంగా చెబుతుంటారు. 1996-2002 మ‌ద్య కాలంలో రాజ్యస‌భ స‌భ్యునిగా ఉన్న సమయంలో పార్ల‌మెంట‌రీ అధికార భాషా సంఘంకు డిప్యూటీ ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఛైర్మ‌న్‌గా ఎల్‌కె అద్వానీ వ్య‌వ‌హ‌రించేవారు. 
కృష్ణా జిల్లా గుడివాడ స‌మీపంలోని వాన‌పాముల‌కు చెందిన యార్ల‌గ‌డ్డ జైఆంధ్రా ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి జైలు జీవితం గ‌డిపారు. దివంగ‌త ముఖ్య మంత్రి నంద‌మూరి తార‌క రామారావు కుటుంబానికి అత్యంత స‌న్నిహితునిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న ఎన్‌టిఆర్‌కు హిందీపై ప‌ట్టు సాధించేందుకు అధ్యాప‌కుడే అయ్యారు. చంద్ర‌బాబు అస్తిత్వాన్ని నిరంత‌రం వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ల‌క్ష్మి ప్ర‌సాద్ తెలుగు భాష ప‌ట్ల నాటి ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన ధోర‌ణుల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు ఎండ‌గ‌డుతూ, పాల‌కుల‌కు కంటిలో న‌లుసుగా మారారు. క‌వుల‌ను, క‌ళాకారుల‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌భుత్వాల‌కు సాహిత్య సంప‌ద‌లో చోటు ఉండ‌ద‌ని చెబుతూ వ‌చ్చారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌డు వైఎల్‌పికి స‌ముచిత గౌర‌వం ఇచ్చారు. ఈ నేప‌ధ్యంలో అచార్య యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ తండ్రి బాట‌లో అడుగులు వేస్తున్న త‌న‌యినిగా జ‌గ‌న్ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌న్నారు. క‌నుమ‌రుగ‌వుతున్న తెలుగు వినియోగాన్ని పెంపొందింప‌చేసి రాష్ట్ర స్ధాయిలో రాజ‌భాష‌గా అమ‌లు చేసేలా కృషి చేస్తాన‌న్నారు. ఉత్త‌రాదికి ద‌క్షిణాదికి ఉన్న అంత‌రాన్ని త‌గ్గించేలా సాహిత్య ప్ర‌క్రియ‌ల‌ను కొన‌సాగిస్తాన‌న్నారు.  ముఖ్యమంత్రి అమెరికా పర్యటన నేపధ్యంలో తాను అక్కడ  సిఎం పర్యటన మరింతగా విజయవంతం అయ్యేలా సమన్వయం సాధించనున్నానన్నారు. ముందుగా నిర్ణయించిన షేడ్యూలును అనుసరించి తాను కూడా   ఆయనతో పాటే అమెరికా పయనమవుతున్నానన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: