కృష్ణానది కరకట్టపై నివాసముంటున్న అక్రమ నివాసాన్ని చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఖాళీ చేసి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. భారీ వరదలు, వర్షాల కారణంగా కరకట్టపై చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ముణిగిపోయే ప్రమాదం ఉందని తెలియటంతోనే చంద్రబాబు గెస్ట్ హౌస్ ను వెంటనే ఖాళీ చేసేశారు. ప్రస్తుతానికి గెస్ట్ హౌస్ మెట్లదాకా వరద నీరు వచ్చేసింది. చివరకు చంద్రబాబు కుటుంబం వాడుతున్న వాహనాలను కూడా వేరే రిసార్ట్స్ కు తరలించారు.

 

కరకట్ట పైన ఉన్న అక్రమ నిర్మాణాల్లో చంద్రబాబు నివాసముంటున్న  లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఒకటి. నది పొంగితే మొత్తం నిర్మాణాలన్నీ ముణిగిపోతాయి కాబట్టి కరకట్టను బలోపేతం చేయాలంటే నిర్మాణాలన్నింటినీ తొలగించాలని జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. అయితే జగన్ రాజకీయం చేస్తున్నారని తాను నివాసముంటున్న గెస్ట్ హౌస్ ను కూల్చేయాలన్న ప్లాన్ వేశారంటూ చంద్రబాబు నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.

 

గడచిన ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పులిచింతల రిజర్వాయర్ పొంగి పొర్లుతోంది. దాంతో పులిచింతల ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజికి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. లక్షల క్యూ సెక్కుల్లో వస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపడం సాధ్యం కాదు కాబట్టి వదిలేస్తున్నారు. ఇపుడా నీరంతా నదిలోకి ప్రవహిస్తు కరకట్ట మీదకు వచ్చేస్తోంది.

 

పరిస్ధితిని గమనించిన చంద్రబాబు సిబ్బంది ముందుజాగ్రత్తగా చంద్రబాబు నివాసానికి చుట్టూ భారీ ఎత్తున ఇసుక బస్తాలు పేరుస్తున్నారు. ఇంటి ఆవరణలో కూడా లారీలతో ఇసుకను పోయిస్తున్నారు. క్రింది భాగంలో ఉండే ఫర్నీచర్ మొత్తాన్ని మొదటి అంతస్తులోకి చేర్చారు. ఇందులో భాగంగానే తన కుటుంబంతో కలిసి చంద్రబాబు హైదరాబాద్ కు మకాం మార్చారు. బహుశా వర్షాలు తగ్గి, వరద ముంపు ప్రమాదం తగ్గిన తర్వాతే కరకట్టకు తిరిగి వస్తారని అనుకుంటున్నారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: