జులై నెల 22వ తేదీన శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి చంద్రయాన్ - 2 ను ప్రయోగించిన విషయం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ప్రయోగించిన చంద్రయాన్ - 2 భూ కక్ష్యను వీడి జాబిల్లి కక్ష్య దిశగా విజయవంతంగా దూసుకెళుతుంది. ప్రస్తుతం చంద్రయాన్ - 2 జాబిల్లి కక్ష్య దిశగా ట్రాన్స్ ల్యూనార్ మార్గంలో ప్రయాణిస్తోంది. చంద్రయాన్ - 2 భూకక్ష్యను వీడి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించటంతో ఇస్రో మరో మైలు రాయిని అధిగమించింది.చంద్రయాన్ - 2 జాబిల్లి కక్ష్య దిశగా దూసుకెళ్ళటానికి కక్ష్యను పెంచే ప్రయోగాన్ని ఈరోజు ఉదయం 2 గంటల 21 నిమిషాలకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. 
 
వ్యోమ నౌకలోని లిక్విడ్ ఇంజిన్ ను 1203 సెకన్ల పాటు మండించి కక్ష్యను పెంచినట్లు సమాచారం. చంద్రయాన్ - 2 ప్రయోగం తరువాత ఐదు సార్లు కక్ష్యను పెంచామని, ఐదు సార్లు కక్ష్యను పెంచటంలో విజయం సాధించామని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్ - 2 ప్రయోగించిన తరువాత ఇప్పటివరకూ ఎలాంటి సమస్య రాలేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. వ్యోమనౌక పనితీరు కూడా బాగానే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఈ నెల 20 వ తేదీన చంద్రయాన్ - 2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో మరొకసారి వ్యోమ నౌకలోని లిక్విడ్ ఇంజన్ ను మండించాల్సిన అవసరం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రో మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ బెంగళూర్ నుండి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపైకి దిగడానికి ముందే నాలుగు కీలక ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ - 2 ల్యాండ్ అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: