గుమ్మడి నర్సయ్య.. ఏపీ రాజకీయాలతో సుదీర్ఘ పరిచయం ఉన్నవారికి ఈ పేరు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఒక్కసారి, రెండు సార్లు కాదు.. ఆయన ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు.


ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే.. తన కొడుకులు, మనవలు, మునిమనవలకు సరిపడా సంపాదించుకుంటున్న రోజులివి.. దందాలు, అక్రమ వసూళ్లు, ఇసుక దందాలు.. కాంట్రాక్టులు ఇలా ఒకటేమిటి.. ప్రతి దాంట్లోనూ పర్సంటేజీలు వసూలు చేస్తున్న కాలమిది. అలాంటిది గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా.. సాదాసీదా జీవనం గడుపుతారు.


ఎమ్మెల్యే అంటే కనీసం కారు.. చుట్టూ నలుగురు అనుచరులు.. లేకుండా బయటకు కదలరు. కానీ గుమ్మడి నర్సయ్య చాలా సాదాసీదాగా ఉంటారు. ఆయన మంగళవారం హైదరాబాద్ లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనం చేస్తూ కనిపించారు. ఆయన్ను గుర్తుపట్టినవారు ఆశ్చర్యపోయారు.


గుమ్మడి నర్సయ్య ఇప్పుడే కాదు.. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ అతినిరాడంబరంగా ఉండేవారు. ఎమ్మెల్యే అయినా సైకిల్ పైనే నియోజకవర్గమంతా తిరిగే వారు. ప్రజల సమస్యలు తెలుసుకునేవారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పని చేసిన గుమ్మడి నర్సయ్య ప్రజల నేతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన్ను ప్రజలు ఐదుసార్లు గెలిపించుకున్నారు.


గుమ్మడి నర్సయ్య వంటి నిరాడంబర నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనిపించరు. ఆయన కంటే ముందు భద్రాచలం ఎమ్మెల్యేగా పని చేసిన కమ్యూనిస్టు నేత కుంజా బొజ్జి కూడా అత్యంత నిరాడంబరంగా జీవించారు. ఎమ్మెల్యే అయినా పక్కా ఇళ్లు కూడా లేకుండా గుడిసె వంటి ఇంటిలోనే జీవించారు. ప్రజల కోసం.. ప్రజాసమస్యల కోసం పరిశ్రమించే ఇలాంటి నిస్వార్థ నేతలు ఇప్పుడు పూర్తిగా కరవయ్యే కాలం వచ్చింది. గుమ్మడి నర్సయ్య వంటి వారు నూటికో కోటికో ఒక్కరు.


మరింత సమాచారం తెలుసుకోండి: