పునర్విభజన చట్టం ప్రకారం ఏపిలో గనుక అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసినట్లే. అధికారంలో ఉన్నారు కాబట్టి పెరిగే సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టటం పెద్ద కష్టం కాదు జగన్ కు. మొన్నటి ఎన్నికల్లోనే చాలా మంది కీలక నేతలకు జగన్ టికెట్లు ఇవ్వలేక అవస్తలు పడ్డారు. అందుకనే కొందరికి ఎంఎల్సీ పదవులు, మరి కొందరికి కార్పొరేషన్ పదవుల హామీ ఇచ్చారు.

 

ప్రతిపక్షంలో ఉన్నపుడే వైసిపి తరపున పోటీ చేయటానికి నేతలు టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటి పడ్డారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగితే ఇక ఎవరైనా ఆగుతారా ? కేంద్రప్రభుత్వం ఆలోచన చూస్తుంటే వచ్చే షెడ్యూల్ ఎన్నికల్లోగానే అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేట్లుగానే ఉంది.

 

ఎందుకంటే, జమ్మూ కాశ్మార్, సిక్కింలో సీట్లను పెంచబోతోంది. కాబట్టి తెలంగాణా, ఏపిల్లో కూడా పునర్విభజన బిల్లులో ఇచ్చిన హామీ మేరకు సీట్ల పెంపు విషయాన్ని హోం శాఖ చురుగ్గా పరిశీలిస్తోంది. సీట్ల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటే చాలు మిగిలిన కసరత్తంతా ఎన్నికల కమీషన్ పూర్తి చేసేస్తుంది. వైసిపిలో సీనియర్ నేతలు చాలామంది అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగటమన్నది బాగా కలిసి వచ్చే అంశమే అనటంలో సందేహం లేదు.

 

పునర్విభజన చట్టం ప్రకారం ప్రస్తుతమున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుండి 225కు పెరుగుతుంది. అంటే ఒక్కసారిగా పెరిగే 50 సీట్లలో మళ్ళీ రిజర్వేషన్ స్ధానాలు కూడా ఉంటాయి. ఎన్ని సీట్లు  రిజర్వేషన్లలో పోయినా తక్కువలో తక్కువ 35 సీట్లు ఓపెన్ కేటగిరిలోనే ఉంటాయనటంలో సందేహం లేదు. ప్రస్తుతం జగన్ దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పోటికి నేతల మధ్య మరింత పోటీ ఖాయమనే అనుకోవచ్చు. ఈ నేపధ్యంలో 50 అసెంబ్లీ సీట్లు పెరగటమంటే జగన్ నెత్తిన పాలు పోయటం కాక మరేంటి ?


మరింత సమాచారం తెలుసుకోండి: