భారత దేశం సగర్వంగా 73 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మన దేశం ఎన్నో అవరోధాలను అధిగమించి అగ్రరాజ్యాల సరసన నిలబడేందుకు కృషి చేస్తోంది. ఒక్కొక్కటిగా ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ పటంపై తనదైన ముద్ర వేసింది. ఈ స్వాతంత్ర దినోత్సవవేళ పలువురు ప్రముఖులు తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దేశాన్ని మరింత ముందుకు నడిపించేందుకు తమ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.


నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు.. ఒక దేశాభివృద్ధికి ఆ పౌరుల చిత్తశుద్దే కారణమవుతోంది. అందుకే మంచి పౌరులను సమాజానికి అందించాలంటే.. ముందు పిల్లల పెంపకం నుంచే ఆ మార్పు మొదలవ్వాలంటున్నారు ప్రముఖ క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్. ఆయన తన సందేశాన్ని ఓ పత్రికతో పంచుకున్నారు. సచిన్ భార్య పీడియాట్రిషన్, సచిన్ కూడా ఐక్యరాజ్యసమితి తరపున బాలల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలా తనకున్న అనుభవంతో ఆయన కొన్ని సూత్రాలను సమాజానికి సందేశం ఇస్తున్నారు.


పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచే శిక్షణ మొదలవ్వాలంటున్నాడు సచిన్. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దగ్గర ‘గర్భ్‌ శంకర్‌’ అనే సంప్రదాయం ఉందని గుర్తు చేస్తున్నాడు. మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులో ఉండగానే యుద్ధకళను నేర్చుకున్నాడని.. మళ్లీ అలాంటి పద్దతి రావాలని సచిన్ అంటున్నాడు. పిల్లల వికాసానికి ఎంతో భద్రమైన, ఆహ్లాదకరమైన పరిసరాలు ఉండాలని.. వారికి పౌష్టికాహారాన్ని అందించాలని సూచిస్తున్నాడు.


పిల్లలకు సరైన ఆహారం పెట్టడం, ఆటల ద్వారా కొత్త విషయాలు నేర్పడం, తల్లిదండ్రులిద్దరూ అపరిమిత ప్రేమను పంచడం ద్వారా భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలమని సచిన్ తన సందేశంలో చెబుతున్నాడు. పిల్లలను సరైన వాతావరణంలో పెంచాలని.. వారితో ఆడిపాడాలని.. చక్కటి పోషణ అందించాలని సూచిస్తున్నాడు. ఇలా చేయగలిగితే.. 2050 నాటికి ఇండియా సూపర్‌ పవర్‌ అవుతందని భవిష్యత్ భారతాన్ని కళ్లకు కడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: