జగన్ నవరత్నాలలో ఒకటైన పధకం మద్యం నివారణ.ఈ కార్యక్రమం రోజు రోజుకు ముందుకు సాగుతోందనే చెప్పుకోవాలి. రోజుకొక ప్రతిపాదని పెట్టి మందు బాబుల గుండెల్లో దడ పుట్టిస్తోంది మన జగన్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. ఎక్సైజ్ శాఖలో నూతన సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నూతన ఎక్సైజ్ విధానం లో ప్రైవేటు మద్యం దుకాణాలు కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యం లో మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి .విడతల వారీ మద్యం నిషేధం అమల్లో భాగంగా ఇరవై శాతం దుకాణా లను రద్దు చేసి మిగిలిన దుకాణాలకూ నోటిఫికేషన్ జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గతంలో నాలుగు వందల డెబ్బై నాలుగు మద్యం దుకాణాలు ఉండగా ఇరవై శాతం అంటే తొంభై ఐదు షాపులు తగ్గించి మూడు వందల డెబ్బై తొమ్మిది ఏపీఎస్ బీసీఎల్ రిటైల్ ఔట్ లెట్స్ ఏర్పాటు కు నోటిఫికేషన్ జారీ చేశారు.


ఈ మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరచివుంటాయి. ప్రస్తుతం రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు నిర్వహిస్తూ ఉండగా ఆ సమయాన్ని ఒక గంటకు కుదించారు. ప్రతి దుకాణంలోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. మద్యం షాపుల నిర్వహణకు ఇళ్లను అద్దెకు తీసుకుంటారు. నూట యాభై నుంచి మూడు వందల చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకుంటారు. ఈ దుకాణాల్లో ఫర్నీచర్ ఏర్పాటు లో భాగంగా సీలింగ్ ఫ్యాన్ లు టేబుళ్లు కుర్చీ లు ఐరన్ రాడ్ లు ఫ్రిజ్ ధరల బోర్డు లు ఉంటాయి. మద్యం కొన్నవారికి తప్పని సరిగా బిల్లులివ్వాలి. ఎమ్మార్పీకే మద్యాన్ని విక్రయించాలి. ఈ నూతన మద్యం విధానం తమిళనాడు రాష్ట్రం తరహాలో ఉందని చెబుతున్నారు. అక్కడ జనాభా ఆధారంగా షాపులు కేటాయిస్తారు. సిబ్బందిని ప్రభుత్వమే నియమిస్తుంది రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం విధానంలో కూడా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. రోజువారీ విక్రయాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. అయితే గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో కూడా ప్రభుత్వమే ప్రయోగాత్మకంగా కొన్ని దుకాణాలను నిర్వహించింది. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు నుంచి మూడు దుకాణా లు ఏర్పాటు చేసి నిర్వహణ చేశారు .అప్పట్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించికపోవటంతో ప్రభుత్వ మద్యం ఔట్ లెట్స్ ను మూసి వేసి ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహించారు. సిబ్బంది నియామకానికి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.


పట్టణ ప్రాంతాలలోని మద్యం దుకాణాలకు ముగ్గురు సేల్స్ మెన్లు ఒక సూపర్ వైజర్, గ్రామంలోని దుకాణాలకు ఇద్దరు సేల్స్ మెన్లు ఒక సూపర్ వైజర్ ను నియమిస్తారు. సూపర్ వైజర్ పోస్టుకు కనీస విద్యార్హత డిగ్రీ, బీకాం చదివిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. ఇక సేల్స్ మెన్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ అర్హతగా పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు జూన్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి నలభై ఏళ్ల వయస్సు మించరాదు. జిల్లా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై తొమ్మిది సూపర్ వైజర్ పోస్టులు ఎనిమిది వందల ముప్పై ఐదు సేల్స్ మెన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత కలిగిన వారు ఆన్ లైన్ లో ఈ నెల ఇరవై ఐదు తేదీ సాయంత్రం నాలుగు గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి. సూపర్ వైజర్ కు నెలకు పదిహెడు వేల ఐదు వందల రూపాయల సేల్స్ మెన్ కు పదిహేను వేల రూపాయల వేతనాన్ని అందజేస్తారు.


ఈ పోస్టుల భర్తీలో జిల్లా యూనిట్ గా రిజర్వేషన్ లను భర్తీ చేస్తారు. ఏడాది కాల వ్యవధిలో ఈ పోస్టు లను భర్తీ చేస్తారు. సంతృప్తికరంగా పని చేస్తే రెండో ఏడాది వీరినే కొనసాగించే అవకాశముంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి మద్యం షాపుల నిర్వహణ ప్రారంభమవుతుంది. మద్యం షాపులు అద్దె కిచ్చే వారు మద్యం షాపుల్లో ఫర్నీచర్ సమకూర్చేవారు రవాణా సదుపాయం కల్పించేవారు ఈ నెల ఇరవై ఒకటివ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మద్యం షాపులు సిబ్బంది నియామకానికి అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ నెల ఇరవై ఐదు తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షాపుల నిర్వహణ జరుగుతుంది.మరి ఇప్పుడు  ఈ ప్రణాలిక ఎంత వరకూ సత్ఫలితాలిస్తాయనేది వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: