తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని క‌లెక్ట‌ర్ల‌కు వినూత్న అనుభ‌వాన్ని అందించారు. ప‌రిపాల‌న‌లో త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ తాజాగా క‌లెక్ట‌ర్ల‌ను అడువుల చెంత‌కు తీసుకువెళ్లారు.అది కూడా ప్ర‌త్యేకంగా పెంచిన అడ‌వుల్లోకి! త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన గజ్వేల్ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీభూములు చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు వెల్లడించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయని సీఎం అన్నారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం  కూడా పెరిగిందన్నారు. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడం వల్ల ఇవి మంకీ ఫుడ్ కోర్టుల లాగా తయారవుతున్నాయని సీఎం చెప్పారు. 
  
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలెక్టర్లను కోరారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని, ఇది మన భూభాగంలో 23.4శాతం  అని సీఎం అన్నారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు. ఉ న్న అడవులను కాపాడుకోవాలని అందులో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. 


గ‌జ్వేల్ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ ను ఉపయోగించుకొని అడవుల్లో సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీసామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ, సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని అన్నారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందన్నారు. 27రకాల పండ్ల చెట్లు కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్ పోతున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, వర్షపాతం పెరుగుతుందని, జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని అటవీశాఖ అధికారులు కలెక్టర్లకు చెప్పారు. ఆయా జిల్లాల్లో అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు అవసరమయ్యే కాంపా నిధులు అందుబాటులో ఉన్నాయని చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు అటవీశాఖ ద్వారా తీసుకుంటామని చెప్పారు. 


అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు. అవినీతికి ఆస్కారం లేని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తున్నదని ముఖ్యమంత్రి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: