అధికార టీఆర్ఎస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు బిజెపి లో చేరబోతున్నారా?, ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో  వారు  టచ్ లో ఉన్నారా??  అంటే అవుననే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.  మంత్రివర్గ విస్తరణ అనంతరం టీఆర్ఎస్ లో అసంతృప్తి గళాలు  వినిపించిన మాట నిజమే అయినప్పటికీ,  ఇప్పటికీ, ఇప్పుడు  14 మంది ఎమ్మెల్యేలు  టిఆర్ఎస్ ను  వీడి బిజెపి లో చేరే  అవకాశాలు ఎంత మాత్రం  ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు .  బిజెపిలో టీఆరెస్ కు చెందిన  14 మంది ఎమ్మెల్యేలు చేరనున్నారంటూ  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారమంతా ఉత్పత్తిదే అయి ఉంటుందని అంటున్నారు .


  కేబినెట్ విస్తరణలో   పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు . వీరిలో కొంతమంది ఇప్పటికే బాహాటంగానే తమ  అసంతృప్తి గళం వినిపించారు .  అయినప్పటికీ వారెవరూ కూడా టీఆర్ఎస్ ను వీడేందుకు  సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు.  మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య తాను అనని  మాటలు అన్నట్లుగా మీడియా వక్రీకరించి  కథనాలను ప్రసారం చేసిందని పేర్కొనగా , మంత్రి వర్గ విస్తరణ అనంతరం  అజ్ఞాతంలోకి వెళ్లిన జోగురామన్న కూడా  మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానంటూ చెప్పుకొచ్చారు .  ఇక మల్కాజ్ గిరి  ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు , మంత్రి  కేటీఆర్  మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది.


 మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా  తాను  పార్టీకి విధేయుడనని ,  తనపై తప్పుడు ప్రచారం చేసే చేస్తే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.  గండ్ర వెంకట రమణా రెడ్డి , బాజిరెడ్డి గోవర్ధన్ లు కూడా తమకు  మంత్రి పదవి పట్ల ఆశ లేదని,  పార్టీ బలోపేతానికి పని చేస్తానని చెప్పుకొచ్చారు . ఈ తరుణంలో 14 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ను వీడి బీజేపీ లో చేరనున్నారని సోషల్ మీడియా లో జరుగుతున్న  ప్రచారమంతా... ఓ  మైండ్ గేమ్ అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: