ప్రపంచవ్యాప్తంగా పేరున్న కశ్మీర్ యాపిల్స్​ విష‌యంలో కేంద్రం తీపిక‌బురు వినిపించింది.  కశ్మీర్​ యాపిల్స్​కు మార్కెట్​ ను మరింత పెంచేందుకు, సాగును రైతులకు లాభసాటి చేసేందుకు కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది.  కశ్మీర్​ అభివృద్ధే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న‌ కేంద్రం నాఫెడ్​ ద్వారా నేరుగా రైతుల నుంచి యాపిల్ల‌ను కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించింది. డిసెంబర్​ 15లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 


జాతీయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య ద్వారా రైతుల నుంచి నేరుగా యాపిల్స్​ ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ యాపిల్స్​ను రైతల నుంచి నేరుగా సేకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. జమ్ముకశ్మీర్​ లోని అన్ని జిల్లాలు, సోపోర్​, సోపియన్, శ్రీనగర్​ లోని హోల్​సేల్​ మార్కెట్ల నుంచి ఏ,బీ, సీ కేటగిరి యాపిల్స్​ను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. మద్దతు ధరను ఆయా యాపిల్స్​ను బట్టి నాణ్యత కమిటీ నిర్ణయిస్తుంది.


కాగా, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. భద్రతా బలగాలను ఎదుర్కోలేక స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు, బెదిరింపులకు గురిచేసే సందేశాలు ఆ పోస్టర్లలో ఉన్నాయి. అంతేగాక ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావద్దని, అధికారులకు సహకరించరాదనే సందేశాలు కూడా కనిపించాయి. పోలీసులు మాట్లాడుతూ లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేస్తున్న స్థానిక ఉగ్రవాది సాజిద్ మీర్ తన సహచరులతో కలిసి ఈ పోస్టర్లను ముద్రించాడని తెలిపారు. పోస్టర్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు మొహర్రం నేపథ్యంలో కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో అధికారులు మంగళవారం మళ్లీ ఆంక్షలు విధించారు. మరోవైపు కశ్మీర్ లోయలో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి 37 రోజులు కావస్తున్నా ప్రజలు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంగళవారం కూడా దుకాణాలు తెరుచుకోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: