త‌న వినూత్న నిర్ణ‌యాలు, ప‌ట్టుస‌డ‌ల‌ని పాల‌న‌తో ముందుకు దూసుకుపోతున్న ఏపీ సీఎం జ‌గ‌న్ తాను తీసుకునే నిర్ణ‌యాల‌పై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్ని ఒత్తిడులు వ‌చ్చినా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌ర్లు. ఈ విష‌యంలో కేంద్రం నుంచి రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌ధాన ప‌త్రిక‌లు నిప్పులు క‌క్కాయి. అయినా కూడా ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా అంద‌రికీ ఆమోద యోగ్యం అయ్యేలానే త‌న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేస్తున్నారు జ‌గ‌న్. తాజాగా పోల‌వ‌రం ప‌నుల‌కు సంబంధించి నిర్వ‌హించిన రివ‌ర్స్ టెండ‌ర్ల‌లో 58 కోట్ల రూపాయ‌ల‌ను ఆయ‌న మిగిల్చి న‌ట్టు లెక్క‌ల‌తో స‌హా వివ‌రించారు.


దీంతో అప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శించిన వారు గ‌త్యంతరం లేక దీనిని స‌మ‌ర్ధించారు. ఇక‌, ఇప్పుడు అదే త‌ర‌హాలో మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ల‌క్ష‌ల రూపాయ‌ల వేత‌నాల‌కు ప‌నిచేస్తున్న వైద్యులు ప్రైవేటుగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో పేద‌ల‌కు స‌రైన విదంగా చికిత్స‌లు అంద‌డం లేదు. దీనిపై కొన్ని ద‌శాబ్దాలుగా విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలోని ఎన్టీఆర్ ప్ర‌భుత్వం నుంచి వైఎస్ స‌ర్కారు వ‌ర‌కు ఇలా ప్రైవేటు ప్రాక్జీస్ చేసే వైద్యుల‌పై కొర‌డా ఝ‌ళిపించాల‌ని నిర్ణ‌యించుకున్నాయి.


అయితే, అప్ప‌టి కార‌ణాలు, వైద్యుల ఉద్య‌మ బాట‌లు, న్యాయ పోరాటాల‌తో వెనక్కి త‌గ్గాయి. ఇక‌, ఇప్పుడు ఇప్పుడు ఇదే విష‌యాన్నిప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న జ‌గ‌న్ ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యంలో వైద్యుల నుంచి ఎన్ని ఒత్తిడులు వ‌చ్చినా.. ముందుకు సాగాల‌నే నిర్ణ‌యించ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధికంగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌ విభాగాల్లో ఉన్నారు.


రాష్ట్రంలోని 90 మంది స్పెషలిస్టులు ఈ రెండు విభాగాల్లోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఈ రెండు విభాగాల వైద్యులపైనే పడనుంది. ముఖ్యంగా డీఎంఈ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌ను నిషేధిస్తే తాము ప్రభుత్వంలో కొనసాగలేమని చాలామంది వైద్యులు బహిరంగంగానే చెబుతున్నారు. అవసరమైతే వాలంటరీ రిటైర్‌మెంట్‌(వీఆర్‌) తీసుకుంటామని అంటున్నారు. అయితే, తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని ఎట్టిప‌రిస్థితిలోనూ అమ‌లు చేయాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ సంబంధిత అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి వైద్యులు వెళ్లిపోతే ఏం చేయాలనే విషయంపై ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది.


ఒకేసారి వైద్యులు విధులు నుంచి బయటకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లుకు సిద్ధమవుతోంది. బ్యాన్‌ అమలులోకి వచ్చిన వెంటనే ఎక్కడైతే స్పెషాలిటీ వైద్యులు బయటకు వెళ్లిపోతారో, అక్కడ వెంటనే అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో కొత్త వైద్యులను తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే జ‌రిగితే.. గ‌త ప్ర‌భుత్వాల‌ను మించి జ‌గ‌న్ దూసుకు పోవ‌డం ఖాయ‌మ‌ని, త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటు కోవ‌డం త‌థ్య‌మ‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: