వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు వీడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన కేసు ఇది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ హత్య జరిగింది. ఎన్నికల ముందు ఈ హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే హంతకులెవరో మాత్రం తేలలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా నిందితులను పట్టుకోలేకపోయింది.


రాష్ట్రంలో ప్రభుత్వం మారినా వైఎస్ హత్య కేసు మిస్టరీ వీడలేదు. అంతే కాదు. దర్యాప్తు సమయంలో పోలీసు అధికారులు బదిలీ కావడం కూడా అనుమానాలకు తావిచ్చింది. తాజాగా పోలీసులు ఈ హత్య కేసు మిస్టరీ తేల్చేశారని తెలుస్తోంది. వివేకానందరెడ్డిని చంపింది ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ పని చేసినట్టు భావిస్తున్నారు.


ప్రొద్దుటూరు కు చెందిన సునీల్ గ్యాంగ్ సుపారీ తీసుకుని హత్యలు చేస్తుంటుంది. ఈ సునీల్ గ్యాంగ్ విషయం వారు వాడిన ఓ బైక్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ సునీల్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చింది కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డిగా పోలీసులు గుర్తించారు.


అయితే ఈ శ్రీనివాసరెడ్డి కూడా కొన్నిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ శ్రీనివాసరెడ్డి వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరన్న విషయాలపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి వరకూ వివేకా హత్య కేసు పై పోలీసులు విచారణ పెద్దగా ముందుకు కదలలేదు. కానీ ఈ పరిణామంతో ఇప్పుడు దర్యాప్తు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.


గతంలో పోలీసులు వివేకా హత్య కేసు విషయమై.. ఆయన పీఎ కృష్ణారెడ్డి, బంధువు గంగిరెడ్డితో పాటు అనేక మందిని గుజరాత్ తీసుకెళ్లి మరీ నార్కో అనాలసిస్ టెస్టులు చేశారు. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇక ఇప్పుడైనా కేసు దర్యాప్తు వేగవంతం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: