ప్రజల్ని వేధించినట్లే కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సైతం వైకాపా ప్రభుత్వం వేధిస్తోంది. నవరాత్రుల సమయంలోనూ తిరుమలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లను చేయడంలో వైకాపా ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కంభంపాటి పేర్కొన్నారు. వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఒకవైపు చెబుతూనే.. అధికార పార్టీ నేతల సిఫార్సులకు పెద్దపీట వేస్తూ సామాన్యులకు ఇక్కట్లకు గురిచేస్తున్నారు. వసతి, తాగునీరు వంటి కనీస వసతులు లేక వేలాదిమంది భక్తులు ఇక్కట్లకు గురవుతున్నా.. వైకాపా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని అయన అన్నారు. 


భక్తులు ఇబ్బందులు పడుతుంటే కొండవీటి ఛాంతాడంత మంది ఉన్న టీటీడీ సభ్యులు ఏం చేస్తున్నారు..? ప్రభుత్వం తమ చేతిలో ఉందనే నియంతృత్వంతో.. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా మొత్తం 36 మందిని పాలకమండలి సభ్యులుగా నియమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిఫార్సులు, గతం నుంచీ వైసీపీతో సన్నిహితంగా ఉన్న కొందరు పారిశ్రామిక వేత్తలను సంతృప్తి పరిచేలా బోర్డు సభ్యుల నియామకం చేపట్టారు తప్ప భక్తుల మనోభావాలను వైకాపా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అందులోనూ అందరూ సంపన్నులు, డెకాయిట్లనే నియమించారు. 


టీటీడీ బోర్డులో జగన్‌ కేసులో నిందితుడిగా ఉన్న నారాయణస్వామి శ్రీనివాసన్‌, కాల్‌మనీ కేసులో, వరకట్న వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న పరిగెల మురళీకృష్ణ వంటి అవినీతిపరులకు, వివిధ క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారిని నియమించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శేఖరరెడ్డిని చంద్రబాబు బినామీగా సృష్టించిన వైసీపీ నాయకులు.. నేడు అదే శేఖరరెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సలహా మేరకు అక్కడి వారిని ఏడుగురిని సభ్యులుగా నియమించారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ బోర్డు పూర్తిగా రాజకీయ పునరావాసమైంది. భక్తి కంటే కూడా పైరవీలకే ప్రాధాన్యత పెరిగిపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒంటెద్దు పోకడలను అవలంభిస్తూ.. కోట్లాది హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని కంభంపాటి పేర్కొన్నారు.

 

ప్రతికారం చుట్టూనే జగన్‌ పాలన.. 

 

               విద్యార్థుల నుంచి ఉద్యోగుల దాకా, రైతుల నుంచి పారిశ్రామిక వేత్తల దాకా అన్ని వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. కేసీఆర్‌ ప్రయోజనాలే పరమావధిగా జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. పనికొచ్చేవి పడగొట్టడం, రాష్ట్ర ప్రతిష్టను చెడగొట్టడం అన్న విధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం ఏర్పరుస్తున్నారని జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఏపిలో జగన్‌ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందుతుందని, అమరావతి అభివృద్ధి ఆగిపోతుందన్న కేసీఆర్‌ ఆలోచనను.. అక్షరాలా నిజం చేసి చూపారు జగన్మోహన్‌రెడ్డి. ప్రతీకారం చుట్టే ఆయన పరిపాలన పరిభ్రమిస్తుంది. 


ప్రతీకారంపై చూపిస్తున్న శ్రద్ధ.. పాలన వ్యవహారాలపై చూపించడం లేదని జగన్ తెలియజేశారు. కియా యాజమాన్యంపై బెదరింపులకు పాల్పడ్డారు. జగన్‌ నిరంకుశాన్ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారు. జగన్‌ నాలుగు నెలల పాలనలో ప్రతిరంగమూ సంక్షోభంలోకి నెట్టబడింది. గత ప్రభుత్వం చేసిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై సిఎం జగన్‌ చేసిన ఆరోపణలు అవాస్తవాలని కోర్టు తీర్పుతో రుజువైంది. ఒప్పందాల సమీక్షకు సంప్రదింపుల కమిటీ వేస్తూ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63 హైకోర్టు కొట్టివేసి చీవాట్లు పెట్టింది. ఇప్పటికైనా వైకాపా నాయకులు తమ పంథాను మార్చుకుని.. ప్రజాభిష్టానికి తగ్గట్లు పాలన సాగించాలి. లేకుంటే ప్రజా క్షేత్రంలో పరాభవం తప్పదని కంభంపాటి ఈ సందర్భంగా తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: