నిశ్చితార్థం అయ్యిందంటే సగం పెళ్లి అయిపోయినట్టే.. అందుకే ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ ను కూడా పెళ్లికి దీటుగా చేసుకుంటున్నారు. మరి అలాంటిది ఎంగేజ్ మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లికి నో చెబితే ఎలా ఉంటుంది ఎవరికైనా.. హైదరాబాద్‌ లోని జవహర్ నగర్ పరిధిలో అదే జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా కారెంపూడి మండలం నెర్మట పేటకు చెందిన గొర్ల సుబ్బలక్ష్మి.. కుమార్తె మల్లీశ్వరీ , కుమారుడితో కలిసి యాప్రాల్ పరిధిలోని చిన్నకందిగూడకు వలసవచ్చారు. రెండేళ్ల క్రితం సమీప బంధువైన మారం సుధాకర్ తో కుమార్తెకు వివాహ నిశ్చితార్థం చేశారు. ఆ తర్వాత మల్లీశ్వరీ బంధువులు మృతి చెందడంతో వివాహాన్ని వాయిదా వేశారు.


ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ... సుధాకర్ మళ్లీశ్వరితో పెళ్లికి నో చెప్పాడు.. ఆమెతో వివాహానికి నిరాకరించాడు. దీంతో మళ్లీశ్వరి కుటుంబీకులు గత ఏప్రిల్లో జవహర్‌నగర్ రాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువులు నచ్చజెప్పడంతో వివాహం చేసుకుంటానని ఒప్పు కొన్నాడు. అయితే సుధాకర్ ఈ నెల 9న నెల్లూరులో మరో యువతిని వివాహం చేసుకున్నట్లు బంధువులకు సమాచారం అందించాడు.


దీంతో మనస్తాపం చెందిన మల్లీశ్వరీ ఈ నెల 11న గుర్తు తెలియని మందు తాగింది. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఎంగేజ్ మెంట్ పెళ్లి తర్వాత పెళ్లికి ఇష్టం లేకపోతే.. ఈ విషయంపై ఆ కుటుంబంతో చర్చించాల్సింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుని ఉండాల్సింది. కానీ కనీస సమాచారం ఇవ్వకుండా ఓ అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకుని ఆ విషయం దాచి పెట్టి మరో పెళ్లి చేసుకుని సుధాకర్ ఇద్దరు అమ్మాయిలకు అన్యాయం చేసినట్టయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: