మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం మొదలైంది. పదవికి పోటి చేసే అభ్యర్దులు విన్నూతంగా ప్రచారాలు చేస్తూ, ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తన ప్రచారంలో బీజేపీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌పై అణుబాంబు వేసినట్టేనని  సంచలనంగా మాట్లాడారు.. థానేలోని మిరా భయేందర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నరేంద్ర మెహతా తరపున ప్రచారం చేసిన మౌర్య తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు ఈవీఎంల్లో కమలం గుర్తును ఎంచుకుంటే పాకిస్తాన్‌పై అణుబాంబును జారవిడిచినట్టు అవుతుందని అన్నారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ వల్లే సాధ్యమైందని, కమలం గుర్తు అభివృద్ధికి సంకేతమని, లక్ష్మీ దేవత సైకిల్‌ లేదా వాచ్‌పై కూర్చోదని, ఆమె కమలం పువ్వుపై మాత్రమే కూర్చుంటారని వ్యాఖ్యానించారు. ఇకపోతే మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో బిజెపి వీటిని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానాల్లో బిజెపియే అధికారంలో ఉండటంతో, ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది.


అదీగాక ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలోని 11 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో తమదే విజయమని అధికార బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఏకపక్ష ఫలితాలే వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన విపక్షాలు సైతం మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నాయి. 11 స్థానాలకు 110 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థుల విజయంపై ధీమాగా ఉన్నారు. ఇక ఈ చతుర్ముఖ పోటీలో విజయం ఎటువైపో చూడాలి.  ఇక మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరగనున్న సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 24న వెల్లడవుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: