“సచివాలయంలోకి జర్నలిస్టుల రాకపోకలపై ఆంక్షలు విధించడం అన్యాయం. మీడియాపై ఆంక్షలంటే ప్రజాస్వామ్యంపై ఆంక్షలు విధించడమే. అవినీతి, అక్రమాలను వెలికితీసే మీడియా ను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలను పాతరేయడమే. కేసీఆర్‌ నియంతృత్వ ధోరణికి ఈ చర్య అద్దం పడుతుంది” అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని కోరారు.

TS Government bans Media Entry into Secretariat 

దీనికి పూర్వ రంగం ఇలా ఉంది:


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ అంతా ఆయన చేతులపై నుండే జరుగుతుంది.  ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆయన ప్రేరణతోనే జరుగు తాయి. ప్రభుత్వ కీలక ఉత్తర్వులన్నీ ఆయన ఆదేశాల కారణంగానే జారీ అవుతాయి. రాష్ట్ర పాలనావేదిక సచివాలయానికి ఆయనే అధినేత. ప్రభుత్వ కార్య నిర్వాహకుడు ప్రభుత్వ సముఖం. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను అమలుచేసే అన్నీ విభాగాలకు అధిపతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.  అలాంటి సర్వోన్నతాధికారి  సాధారణ ఉద్యోగుల్లా తానూ ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేననటంలో ఆయనలో నెలకున్న నిరాశా నిస్పృహలే కారణం కావచ్చు.

 

తెలంగాణ సెక్రటేరియట్ లేదా సచివాలయంలోకి పాత్రికేయుల ప్రవేశంపై తాను ఏమీ చేయలే నంటూ నిస్సహాయత బహిరంగంగానే ప్రకటించారు. జర్నలిస్టులపై ఆంక్షలు ప్రభుత్వ నిర్ణయ మని, ఆ విషయంలో తాను ఒక వ్యక్తిగా ఏమీ చేయలేనని “ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి”శైలేంద్ర కుమార్  జోషి స్పష్టం చేశారు.

 

“మీరు వార్తలు రాస్తే సంతోషం. రాయకపోయినా నాకెలాంటి ఇబ్బంది లేదు. నాకేమైనా ఓట్లు కావాలా! మీడియాను నేనెందుకు అడ్డుకుంటా? జర్నలిస్టులను నిలువరించటానికి నేనెవరిని? నేను అందరిలా ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే! మీడియాను అనుమతించరాదన్నది ప్రభుత్వ ఆదేశం. దాన్నే అమలు చేస్తున్నాం. అది కార్యనిర్వాహక వ్యవస్థ అధిపతిగా ఇక్కడ నా బాధ్యత” అని స్పష్టంగా తెగేసి చెప్పారు.

 

తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు వారి పద్దతిలో వారు నిరసనలు తెలుపుతున్నారని, మీరు కూడా మీ పద్దతిలో నిరసన వ్యక్తం చేసుకోవచ్చని చెప్పారు “సచివాలయ బీట్‌ రిపోర్టర్లు” గత శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని  కలిశారు.

 

తాత్కాలిక సచివాలయంలో జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేయాలని, స్వేచ్ఛగా సమాచారం సేకరించే అవకాశం కల్పించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజా ప్రభుత్వం లో సమాచార సేకరణ, ప్రసారం, ప్రకటనలు జర్నలిస్టుల హక్కు అని గేటు ఎదుట మౌనంగా నిరసన వ్యక్తం చేశారు.

 

అంతకుముందు దాదాపు 40 నిమిషాలపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో వారు చర్చలు జరిపారు. జర్నలిస్టులపై గత ఐదు దశాబ్దాలల్లో ఏ ప్రభుత్వమూ విధించని ఆంక్షలు ఆఖరకు సీమాంధ్ర పాలకులు కూడా ఇలా చేయలేదని జర్నలిస్టులు ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి  వివరించారు.

 

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ముందు వరుసలో ఉన్నారని, అదే తెలంగాణలో జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించడం ఏమిటని ప్రశ్నించారు. దాంతో, తెలంగాణ కోసం మీరంతా పోరాడిన విషయం తనకు తెలుసని, ప్రభుత్వంలో మార్పు వస్తే తప్ప ఆంక్షలు తొలగించలేమని సీఎస్‌ స్పష్టం చేశారు. పారదర్శకత పాటించడానికి తనకేమీ ఇబ్బంది లేదని, సీఎంవో నిర్ణయం మేరకే ముందుకెళుతున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: