ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు రైతు భరోసా పథకం పెంపు గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. 2017లో ప్రజల విజ్ఞప్తుల మేరకు, పాదయాత్రలో రైతులు సమస్యలు చెప్పినపుడు ప్రతి సంవత్సరం పెట్టుబడి సహాయం అందిస్తానని జగన్ కీలకప్రకటన చేశారని అన్నారు. 2020 మే నెల నుండి అమలు చేస్తామన్న వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని రైతుల సంక్షేమం కొరకు ఈ సంవత్సరం నుండే అమలు చేస్తున్నట్లు తెలిపారు. 
 
ఈ పథకంలో కేంద్రం వాటా కూడా ఉండటంతో ఈ పథకానికి వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ అని పేరు మార్చినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ పథకం రేపు ప్రారంభం అవుతుందని చెప్పారు. రైతు భరోసా పథకాన్ని 12,500 రూపాయల నుండి 13,500 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఎట్టి పరిస్థితులలోను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. 
 
ఈ పథకాన్ని మొదట 4 సంవత్సరాలకు అమలు చేయాలని అనుకున్నామని కానీ ఇప్పుడు 5 సంవత్సరాల పాటు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. 5 సంవత్సరాలలో 67,500 రూపాయలు పెట్టుబడి సాయంగా ఈ పథకంలో భాగంగా ఇస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు పెట్టుబడిసాయం అందించటాన్ని సీఎం జగన్ తొలిసారిగా ప్రవేశపెట్టారని అన్నారు. రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. 
 
మే నెలలో 7,500 రూపాయలు, అక్టోబర్ నెలలో 4,000 రూపాయలు, సంక్రాంతి పండుగ సమయంలో 2,000 రూపాయలు ఇవ్వాలని రైతు ప్రతినిధులు చేసిన సూచనలను సీఎం జగన్ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 54 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు. 40 లక్షల మందికి రేపు ఈ పథకం అందబోతుందని నవంబర్ 15 వరకు అర్హత కలిగిన రైతులు ధరఖాస్తు చేసుకొని పెట్టుబడిసాయం పొందవచ్చని తెలిపారు. 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: