ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటి వరకూ కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన టీఆరెస్ ప్రభుత్వం ఎట్టకేలకు  కాసింత బెట్టు సడలించినట్లు కన్పిస్తోంది . నిన్న, మొన్నటి  వరకూ అసలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న అధికార పార్టీ , ఇప్పుడు  ఆర్టీసీ కార్మిక జే ఏ సీ నాయకులతో చర్చలు జరిపేందుకు   రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు ను రంగం లోకి దింపింది . ఒకవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకుంటుండడం ... మరొకవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపధ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది .


  ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తుండడం తో  చర్చలు జరిపి సమస్యలు పర్కిష్కరించాలని  ఈ రోజు ఉదయం  ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించిన  కేకే , హస్తిన కు బయల్దేరి వెళ్లారు . అయితే హస్తిన కు వెళ్లిన కేకే ను వెంటనే నగరానికి తిరిగి రావాలని వచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది . కేసీఆర్ ఆదేశాలతో హుటాహుటిన నగరానికి పయనమైన కేకే , చర్చలకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల జే ఏ సీ నేతలకు పిలుపునిచ్చారు . కేకే మధ్యవర్తిత్వం పై ఆర్టీసీ కార్మిక సంఘాల జే ఏ సీ నేత అశ్వత్దామరెడ్డి స్వాగతించారు .


 కేకే అంటే తమకు గౌరవం ఉందని , తెలంగాణ ఉద్యమం లో మొదటి నుంచి ఉన్న వ్యక్తి అంటూనే , ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు . ఈ ప్రభుత్వం లో వేరే వ్యక్తులు చెబితే ముఖ్యమంత్రి వినే పరిస్థితి లేదని ,  కేకే చర్చలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలని  అన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: