తెలంగాణ‌లో జ‌రుగుతున్న‌ప్ప‌టికీ...పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. 11వ రోజుకు  చేరుకున్న సమ్మెలో  భాగంగా కార్మికుల  ఆందోళనలు  కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె, కార్మికుల డిమాండ్లు, సెల్ఫ్ డిస్మిస్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ  జరగనుంది. మ‌రోవైపు కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేంగా ఇంకో న్యాయ‌వాది పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


ఆర్టీసీ కార్మికులు,  జేఏసీ నేతలు ఉదయం  నుంచే  పలు డిపోల  దగ్గర  నిరసనలు  తెలుపుతున్నారు కార్మికులు.  బస్సులు బయటకు  రానివ్వకుండా  డిపోల  ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. డిమాండ్ల  సాధన కోసం  ఉద్యమాన్ని ఉధృతం  చేస్తున్న జేఏసీ నేతలు ఇవాళ  డిపోల ముందు మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నారు. కార్మికులెవరు  ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచిస్తున్నారు. కార్మికుల  సమ్మెకు అన్ని పార్టీలతో పాటు ప్రజల నుంచి  మద్దతు పెరుగుతోంది.  సర్కార్ తీరుకు నిరసనగా హుజుర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు  సీపీఐ మద్దతు విరమించుకుంది. ఇవాళ్టీ  నుంచి పూర్తి స్థాయిలో  ఆర్టీసీ కార్మికులకు  మద్దతుగా  పూర్తి స్థాయిలో  ఆందోళనల్లో పాల్గొనాలని  నిర్ణయించింది.


మ‌రోవైపు ప్ర‌భుత్వం సైతం చ‌ర్చ‌ల బాట‌ప‌ట్టింది. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  పరిస్థితి చేయిదాటిపోకముందే సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంకావాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా ఇతర సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం కూడా వీటిని పరిశీలించాలని కోరారు. కేకే సూచనపై ఆర్టీసీ జేఏసీ సానుకూలంగా స్పందించింది. ఆహ్వానిస్తే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేశవరావు మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానం పలుకాలని అన్నారు. ఒక్కసారి చర్చలు మొదలైతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ అంటే ఉద్యమనాయకుడిగా అపూర్వ నమ్మకం, గౌరవం ఉన్నదని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: