ఆంధ్రప్రదేశ్ లో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో  ప్రారంభించిన రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో కౌలు రైతులను  కూడా చేర్చడం పట్ల  సర్వత్రా హర్షాతిరేకాలు  వ్యక్తమవుతున్నాయి.  తెలంగాణలోనూ టీఆరెస్ ప్రభుత్వం  రైతుబంధు పథకం అమలు చేస్తున్నప్పటికీ , అందులో  కౌలు రైతులకు మేలు చేయడం లేదు. రైతుబంధు పథకం లో తమల్ని కూడా లబ్ధిదారులుగా చేర్చాలని  కౌలు రైతులు కోరుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెడుతూ వస్తున్నారు .


  ఇప్పటికే ప్రభుత్వంలో ఆర్టీసీ ని జగన్ మోహన్ రెడ్డి  విలీనం చేసిన నేపథ్యంలో,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోన్న విషయం తెల్సిందే .  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఈనెల ఐదో తేదీ అర్ధ రాత్రి  నుంచి ఆర్టీసీ  కార్మికుల సమ్మె బాట పట్టారు .  ఇక ఇప్పుడు రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం లో భాగంగా కౌలు రైతులను కూడా లబ్ధిదారుల జాబితాలో జగన్ చేర్చడం ద్వారా,  తెలంగాణలోనూ తమకు రైతుబంధు అమలు చేయాల్సిందేనని కౌలు రైతులు  కూడా తమ  గళం విప్పే  అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


 రైతు భరోసా పథకం లో కేంద్ర ప్రభుత్వం వాటా గా ఆరు వేల రూపాయలు లబ్దిదారులైన రైతులకు  అందనుండగా ,  రాష్ట్ర ప్రభుత్వం 7500 రూపాయలను అందజేయనుంది.  తొలుత 12500 రూపాయలను అందజేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరొక వెయ్యి రూపాయలను పెంచి , మొత్తంగా 13500 రూపాయలను లబ్ధిదారులకు మూడు విడతల్లో అందజేయాలని నిర్ణయించింది .  50 లక్షల మంది  రైతులతో పాటు , మరో మూడు లక్షల మంది కౌలు రైతులకు రైతుభరోసా -పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: