అధికారం అనుభవించి దిగిపోయిన వారు బాగానే ఉన్నారు. ఎన్నో ఆశలతో ఏపీ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న జగన్ కి మాత్రం పెద్ద తలకాయ నొప్పిలాగా ఉంది. గడచిన అయిదేళ్ళ కాలంలో పోలవరం చంద్రబాబు సర్కార్ కి ఏటీఎం లా మారిందని ప్రధాని మోడీ ఏకంగా గోదావరి జిల్లాల మీటింగులోనే కడిగిపారేశారు. పోలవరం అవినీతి జరిగిందని బీజేపీ కోడైకూసింది. ఇక పోలవరం విషయంలో విచారణ జరిపించాలని కూడా కోర్టు కేంద్రాన్ని కోరింది.


ఇవన్నీ ఇలా ఉంటే పోలవరం విషయంలో ఇప్పటివరకూ ఏపీ ఖర్చు చేసిన అయిదు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఇవ్వాలని ఈ మధ్య ఢిల్లీ వెళ్ళిన జగన్ ప్రధానిని కోరుకున్నారు. అదే సమయంలో వేగంగా పోలవరం పనులు జరగడానికి వీలుగా 16 వేల కోట్ల రూపాయలను తక్షణం మంజూరు  చేయాలని కూడా కోరారు. సరే ఈ విన్నపాలు ఎటూ ఉంటాయి. కేంద్రం ఇవ్వాల్సింది ఇస్తుంది కానీ ఇపుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీ మీద కఠినంగా ఉండడమే అసలు సమస్యగా ఉంది.


పోలవరం విషయంలో ఉమ్మడి ఏపీలో ఖర్చు చేసినట్లుగా చెబుతున్న అయిదు వేల కోట్ల రూపాయల మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి అంటే ప్రతీ పైసాకు లెక్కలు చెప్పాల్సిందేనని కేంద్ర  జలవనరుల మంత్రి షెకావత్ గట్టిగానే చెబుతున్నారుట. అంతే కాదు, పోలవరం విషయంలో 2014 నుంచి ఇప్పటివరకూ పెట్టిన ఖర్చుకు లెక్క అంతా పక్కాగా ఉంటేనే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పారట. దీంతో జగన్ సర్కార్ తల పట్టుకోవాల్సివస్తోందని టాక్. గత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చుకు అదీ పైసా మొత్తం లెక్కకట్టి చెప్పడం అంటే మాటలు కాదు, దానికి తోడు దుబారా, అవినీతి దుర్వినియోగం వంటివి చాలానే జరిగాయి. అటువంటి సమయంలో లెక్కలు ప్రతీ పైసాకు అంటే కష్టమే కాదు, అసాధ్యం కూడా అంటున్నారు. దీంతో జగన్ సర్కార్ పోలవరం విషయంలో డబ్బు ఎలా వచ్చేది అని ఆలోచిస్తొందట.


ఇక పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఆఫీస్ ని కూడా తొందరలోనే రాజమండ్రీ దగ్గర కొవ్వూరులో ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరుపుతారట. అలాగే కేంద్ర మంత్రి షెకావత్ కూడా స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారని, దాని కోసం ఆయన తొందరలోనే ఏపీకి వస్తారని అంటున్నారు. మరి ఢిల్లీలోనే ఉంటూ ఇన్ని కొర్రీలు వేసిన మంత్రి గారు పోలవరం వచ్చి మరెన్ని కొర్రీలు వేస్తారోనని ఏపీ సర్కార్ హడలిపోతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: