ఎన్నో మలుపులు తిరుగుతున్న మహరాష్ట్ర ఎన్నికలు. పొత్తులతో ఆధిపత్యాన్ని కూడ కట్టుకోవాలని చూసిన పార్టీలకు ఊహించని విధంగా తగులుతున్న షాక్‌లు. ఇదీ ఈ ఎన్నికల్లో జరుగుతున్న తంతూ. ఇకపోతే ప్రజల్లో బాగా పలుకుబడి ఉన్న పార్టీగా శివసేనకు పేరుంది. కాని ఈ పొత్తులే ఇప్పుడు శివసేన కొంపముంచుతున్నాయి. ఇంతకాలం ఈ పార్టీపై అభిమానంతో ఉన్నవారు క్రమక్రమంగా పార్టీనుండి దూరమవుతున్నారు. ఇకపోతే ఎన్నికలు దగ్గరపడే కొద్ది శివసేన పార్టీలో రాజీనామాల వ్యవహారం తలనొప్పిగా తయారైంది. ఈ సందర్భంలో బీజేపీతో కలిసి పొత్తుతో వెళుతున్న శివసేన పార్టీలో విబేధాలు బయటపడ్డాయి.


తూర్పు కల్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన 26 మంది కార్పోరేటర్లు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం మరవకముందే, మరో 300 మంది పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా లేఖలను పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు పంపారు. ఇక ఈ ఘటన మరువకముందే, మరో 56 మంది కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు. వీరంతా పాల్‌ఘర్‌ జిల్లాలో దహను తహసిల్‌లో రెండు పెద్ద గ్రామాలైన అంబేసరి, నాగ్జారి నుంచి శివసేన పార్టీకి చెందిన 56 మంది యువ ఆదివాసీ కార్యకర్తలు. వారంతా దహను నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి వినోద్‌ నికోలే గెలుపు కోసం కృషి చేస్తున్నారు. వీరందరికీ ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు సిపిఎం ప్రజాసంఘం పార్టీ వారు..


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను శివసేన-బిజెపి ప్రభుత్వం ఎలా మోసం చేసేందో తెలిపారు. ఎర్రజెండా వెంట నిలిచేందుకు తాము నిర్ణయించుకున్నామని, వినోద్‌ నికోలే విజయం కోసం హృదయపూర్వకంగా పనిచేస్తామని అన్నారు. ఈ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థికి అనుకూల వాతావరణం వుందని, వీరి చేరికలతో బలం మరింత పెరిగిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.


మరోవైపు బీజేపీ అభ్యర్థులకు సహకరించి మద్దతు తెలపాలని పలుమార్లు శివసేన చీఫ్ రెబల్ అభ్యర్థులను అభ్యర్థించారు. కానీ వారెవరూ వినేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇక పొత్తులో భాగంగా టికెట్లు దక్కని వారు బాధపడకూడదని తనను క్షమించాల్సిందిగా కోరారు ఉద్ధవ్ థాక్రే. అదే సమయంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కూడా పిలుపునిచ్చారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాల్లో పోటీ చేయనుండగా శివసేన 126 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇతరులు 14 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, అక్టోబర్ 24న కౌంటింగ్ జరగనుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: