అవును ’తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే’ అనేది తెలుగులో ఓ నానుడి ఉంది. అంటే దీని అర్ధమేంటంటే ఎంత తమ్ముడైనా పేకట దగ్గర మాత్రం తమ్ముడని కూడా చూడకూడదు అని. తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ వ్యవహారంలో  జగన్మోహన్ రెడ్డి వైఖరి అలాగే ఉంది చూస్తుంటే. ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితం గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు.

 

అయినా జగన్ తీసుకుంటున్న పాలనా పరమైన  నిర్ణయాలు కెసియార్ కు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తునే ఉన్నాయి. తెలంగాణా విషయాన్ని పక్కనపెట్టినా ఏపిలో తన చేతిలోనే శాస్వత అధికారం ఉండాలంటే పరిపాలన ఎలాగుండాలనే విషయంలో జగన్ కు స్పష్టమైన వ్యూహం ఉంది. జగన్ అనుసరిస్తున్న ఆ వ్యూహమే కెసియర్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది.

 

జగన్ తీసుకున్న రెండు నిర్ణయాల వల్ల కెసియార్ కు పెద్ద షాక్ తగిలింది. మొదటిదేమో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం. ఇక తాజాగా తగిలిన షాక్ ఏమిటంటే రైతు భరోసాకు ముందు పిఎం కిసాన్ అనే పేరు తగిలించటం. ఆర్టీసిని అచ్చంగా ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాకపోవటంతో 52 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేశారు. అంతేకాకుండా వాళ్ళ ఉద్యోగ విరమణ వయసును 58 నుండి 60కి పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు.

 

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తెలంగాణాలో ఏ స్ధాయిలో ప్రకంపనలు సృష్టిస్తోందో అందరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నదే. ఏపి విషయాన్ని చూపించి తెలంగాణాలో42 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు.

 

సరే నోటి దురుసు వల్ల కెసియార్ కార్మికులతో గొడవలు పెట్టుకోవటంతో కార్మికులు బాగా రెచ్చిపోతున్నారు. చివరకు ఈ సమ్మె భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తుందో తెలీదు. ఇక రెండో షాక్ ఏమిటంటే రైతు భరోసా పథకానికి పిఎం కిసాన్ అనే పేరు తగిలించటం. జగన్ లాంచ్ చేసిన పథకం లాంటిదే కేంద్రం కూడా అమలు చేస్తోంది.

 

చంద్రబాబునాయుడు హయాంలో  కేంద్రపథకాలన్నింటినీ తన పథకాలుగానే ప్రచారం చేసుకునే వారు. కానీ జగన్ అలా చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పథకం కాబట్టే వైఎస్సార్ ’రైతు భరోసా-పిఎం కిసాన్’ అని ప్రకటించారు.  ఎప్పుడైతే జగన్ పథకానికి కేంద్రం పేరు కూడా తగిలించారో వెంటనే తెలంగాణాలో కూడా కెసియార్ అదే పేరు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఎందుకంటే తెలంగాణాలో కూడా పిఎం కిసాన్ పథకం అమలవుతోంది కాబట్టి. మరి కొత్త డిమాండ్ల విషయంలో కెసియార్ ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: