మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు, ఉర‌ఫ్ చిన‌బాబుగా పిలుచుకునే మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర రీతిలో స‌టైర్లు వేస్తున్నారు. చిన్న‌బాబు చిల‌క‌ప‌లుకులు-అంటూ వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 54 ల‌క్ష‌ల మంది.. త‌క్ష‌ణం 40 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూర్చేలా ఈ ప‌థ‌కాన్ని తీర్చిదిద్దారు. 


ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని అనుకున్నా.. రాష్ట్రంలో అకాల వ‌ర్షాలు, అనావృష్టి వంటి కీల‌క అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని అన్న‌దాత‌ల‌ను ఆదుకునేందుకు సాయాన్ని మ‌రో వెయ్యి పెంచి మొత్తంంగా 13500 ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
దీనిలో కేంద్రం నుంచి వ‌చ్చే వాటా కూడా ఉండ‌డంతో  ఈ ప‌థ‌కానికి పార‌ద‌ర్శ‌కంగా వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ పేరుతో ప్రారంభించారు. ఈ క్ర‌మంలో రైతుల‌కు ఏడాదిలో జ‌న‌వ‌రి, అక్టోబ‌రు, మే మాసాల్లో ఈ నిధుల‌ను విడ‌త‌ల వారీగా రైతు ఖాతాల‌కు నేరుగా అంద‌జేయ‌నున్నారు. 


ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ల‌బ్ధి దారుల‌కు నేరుగా భారీ మొత్తం అంద‌జేయ‌ద‌నే విష‌యం అటు కేంద్రంలోని పెద్ద‌ల‌కు, ఇటు రాష్ట్రంలోని పెద్ద‌ల‌కు కూడా తెలిసిందే. అయితే, ఇలా నిధుల‌ను వాయిదా ప‌ద్ధ‌తిలో ఇవ్వ‌డాన్ని మాజీ మంత్రి లోకేష్ త‌ప్పు ప‌డుతూ.. త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ``వాయిదాల ప్ర‌భుత్వం, అన్నీ వాయిదాలే. రైతుల సంఖ్య‌ను త‌గ్గించారు`` అంటూ ఏవో కామెంట్లు చేశారు. అయితే, ఆయా కామెంట్ల‌పై నెటిజ‌న్లు వెంట‌నే రియాక్ట్ అయ్యారు. 


``చిన‌బాబు ఈ చిల‌క‌ప‌లుకులు.. చంద్ర‌బాబుకు చెప్పి ఉండాల్సింది. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ప‌సుపు-కుంకుమ నిధులు ఒకే సారి అందేవి!`` అని కొంద‌రు అంటే.. మీరు ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు క‌నీసం ఇది కూడా ఇవ్వ‌లేదు క‌దా? అని దెప్పిపొడిచిన వారు కూడా క‌నిపించారు. మొత్తానికి చిన‌బాబు రెండు అని సోష‌ల్ మీడియాతో నాలుగు అనిపించుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముందుగా ఏదైనా స‌బ్జెక్టుపై మాట్లాడాలంటే.. కొంత అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని కూడా వారు సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చిన‌బాబు మార్చుకుంటారా?  చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: